- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భోగి మంటల్లో ఏయే వస్తువులు వేస్తారు? ఏవి వేయకూడదు? ఆ మంటల్లో కాచిన నీటితో స్నానం ఎందుకు చేయాలి?
నాలుగురోజుల పెద్ద పండుగ సంక్రాంతి. ముందుగా వచ్చే భోగిరోజున వేసే మంటల్లో ఏయే వస్తువులు వేస్తారు? ఆవు పిడకలను కచ్చితంగా వేయాలా? భోగిమంటల్లో కాచిన నీటితో స్నానం ఎందుకు చేయాలి?

దిశ, వెబ్‌డెస్క్: పల్లెల్లో తెలుగువారి పెద్ద పండుగ.. రైతుల పండుగ.. సంక్రాంతి శోభ మొదలైంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధులు, చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారంతా ఈ పండుక్కి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. డూడూ బసవన్నలు, హరిదాసులు అలరిస్తున్నారు. ఇప్పటికే రంగవల్లులు, ఆటలపోటీలు, డ్యాన్స్ కాంపిటేషన్లు, కైట్ ఫెస్టివల్ వంటి వాటితో సంక్రాంతి ఈవెంట్ల కోలాహలం కనిపిస్తోంది. నాలుగురోజుల పెద్దపండుగలో పిండివంటలు, ఆత్మీయ అనురాగాలను మూటగట్టుకుని మళ్లీ ఏడాది వరకూ ఎదురుచూస్తుంటారు. అయితే.. ఈ పండుగలో ముందుగా వచ్చే భోగిరోజున భోగి మంటలు వేస్తారు. ఆ మంటల్లో ఏయే వస్తువులు వేస్తారు? భోగి మంటల్లో ఆవు పిడకలను కచ్చితంగా వేయాలా? భోగిమంటల్లో కాచిన నీటితో స్నానం ఎందుకు చేయాలి? వంటి విషయాలను ఈరోజు తెలుసుకుందాం.
భోగి మంటల్లో ఆవు పిడకలను కచ్చితంగా వేయాలా?
భోగిమంటలు కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు. దీనివెనుక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆరోగ్య, పర్యావరణ కారణాలు కూడా ఉన్నాయి. భోగిమంటల్లో ఆవు పిడకలను వాడటం వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం ఉంది. ఆవును భారతీయ సంప్రదాయంలో పవిత్రమైన సాదుజంతువుగా భావిస్తారు. గోమాతగా పూజిస్తారు. ఆవు పేడతో చేసిన పిడకలను యజ్ఞయాగాల్లో ఉపయోగిస్తారు. భోగి మంటలను కూడా ఒక యజ్ఞంలాగా భావిస్తారు. ఆరోగ్య కారణం ఏంటంటే.. ఆవు పిడకలను కాల్చినపుడు హానికరమైన వాయువులు తక్కువగా విడుదలవుతాయి. దోమలు, పురుగులు దూరంగా ఉంటాయి. కొంతవరకూ గాలి శుద్ధి అవుతుంది. పర్యావరణం రీత్యా.. ఆవు పేడ సహజంగా శుద్ధి పదార్థం. కాల్చిన తర్వాత వచ్చే బూడిదతో నేలకూడా సారవంతంగా తయారవుతుంది. పంటలకు ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది.
భోగిమంటల్లో ఏయే వస్తువులు వేస్తారు?
భోగి మంటల్లో సంప్రదాయంలో పాత చెక్క సామాన్లు, పాతబట్టలు, పాడైన చాపలు, బుట్టలు, ఎండిన ఆకులు, కొబ్బరి పీచు, ఆవు పిడకలు వేస్తారు. ఈ మంటల్లో ప్లాస్టిక్, రబ్బరు, ఇతర రసాయనాలతో తయారు చేసిన వస్తువులు, పెయింట్ వేసిన చెక్క వంటివాటిని వేయకూడదు. వీటివల్ల పర్యావరణం కాలుష్యమవుతుంది. భోగిమంటలను శుద్ధిచేసే అగ్నిగా భావిస్తారు. అందుకే సహజసిద్ధమైన పదార్థాలనే వేస్తారు.
పాత వస్తువుల్ని భోగిమంటల్లో వేయడం వెనుక పెద్దలు ఒక కారణం చెప్తారు. ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే తొలిపండుగ సంక్రాంతి. ఈ పండుగ నుంచి పాతదాన్ని వదిలి కొత్తదానిని స్వీకరించడం, గత సంవత్సర కష్టాలు, నెగిటివిటీని భోగిమంటల్లో సమర్పించి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని చెప్తారు. కొత్త సంవత్సరం, కొత్తపంట, కొత్త ఆశలకు సంకేతంగా భావిస్తారు. భోగిమంటలను అగ్నిదేవుడికి హవనం చేసినట్లు భావిస్తారు. అహంకారం, అలసత్వం, నిర్లక్ష్యం వంటి గుణాలను వదిలేయాలని సంకల్పిస్తారు.
భోగి మంటల్లో కాచిన నీటితో ఎందుకు స్నానం చేయాలి?
పంటకోత తర్వాత మిగిలిన సహజ వ్యర్థాలను, క్రిములు, పురుగులను నశింపజేసే శక్తి భోగిమంటలకు ఉందని నమ్ముతారు. చలికాలంలో సాధారణంగానే వేడినీటితో స్నానం చేస్తుంటాం. భోగి రోజున భోగిమంటలతో కాచిన నీటితో స్నానం చేయడం ఇంకా మంచిదని భావిస్తారు. ఆవు పిడకలు, చెక్కలు కాల్చినప్పుడు విడుదలయ్యే సహజ వాయువులు, ఆ వేడిలో కాచిన నీటిలో సూక్ష్మ క్రిమినాశక గుణాలు ఉంటాయని నమ్మకం. అందుకే భోగిమంటల వేడినీళ్లతో స్నానం తప్పనిసరిగా చేస్తారు. అగ్నిస్పర్శ పొందిన నీటితో స్నానం చేస్తే.. శరీరంతో పాటు మనస్సు కూడా శుద్ధిగా మారుతుందని చెప్తారు.






