వినాయకుడికి లడ్డూకి మధ్య సంబంధం ఏంటి?.. పురాణాలు ఏం చెబుతున్నాయి?

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-26 04:54:19  IST  )

చిన్న పెద్ద ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వినాయక చవితి వచ్చేస్తోంది.

వినాయకుడికి లడ్డూకి మధ్య సంబంధం ఏంటి?.. పురాణాలు ఏం చెబుతున్నాయి?
X

దిశ,వెబ్‌డెస్క్: చిన్న పెద్ద ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వినాయక చవితి వచ్చేస్తోంది. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో గణేష్ చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది రేపు(ఆగస్టు 27) వినాయక చవితి పండుగ జరుపుకోవడానికి అంతా సిద్ధమైంది. వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు. గణేష్ మండపాలను సైతం అందంగా ముస్తాబు చేశారు. రంగు రంగుల లైటింగ్స్ తో గణనాథుడి మండపాలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇక, రేపు(బుధవారం) వినాయుకుడు మండపాల వద్దకు చేరుకొని ఘనమైన పూజలు అందుకోనున్నాడు. అయితే.. వినాయక చవితి వచ్చిందంటే చాలు అందరికీ గణనాథుడి విగ్రహంతో పాటు ఆయన చేతిలో ఉండే లడ్డూ గుర్తుకొస్తుంది. వినాయకుడి చేతిలో తప్పకుండా లడ్డూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.

అంతేకాదు ఈ గణేషుడి చేతిలో ఉన్న లడ్డూ కొనుగోలు చేయడానికి ఎంత డబ్బులైన ఖర్చు పెడతారు. వేలంలో పాల్గొంటారు. ఈ క్రమంలో చాలా మందిలో గణేషుడి చేతిలో లడ్డూ ఎందుకు పెడతారనే సందేహాలు కూడా ఉన్నాయి. వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూ విశిష్టత ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. గణపయ్య చేతిలో ఉండే లడ్డూకు చాలా ప్రత్యేకత ఉంది. ఆ లడ్డూ అందరూ తినే ఓ తీపి పదార్థం మాత్రమే కాదు. గణపతి లడ్డూ జ్ఞానం, ఆనందం, సంపూర్ణత్వానికి సూచనగా పండితులు చెబుతున్నారు. దీనిని తినడం వలన మంచి జ్ఞానాన్ని పొందడమే కాకుండా సంతోషాన్ని కూడా పొందుతారని అంటున్నారు. అందుకే, గణపతి లడ్డూ వేలంలో చాలా మంది ఎక్కువ డబ్బులతో కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు పురణాల ప్రకారం గణపయ్య లడ్డూకు ఓ కథ కూడా ఉందని పండితులు చెబుతున్నారు.

పురాణల ఏం చెబుతున్నాయంటే.. వినాయకుడు, కార్తికేయల మద్య పోటీ జరిగింది. ఆ పోటీలో శివుడు ఓ పరీక్ష పెడతాడు. అది ఏంటంటే.. కార్తికేయ, గణేశుడు ఎవరైతే భూమండలాన్ని తిరిగి ముందుగా నా దగ్గరికి వస్తారో వాళ్లే విజయులని చెబుతారు. ఈ పోటీలో భాగంగా తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలని గణేషుడు నిర్ణయించుకున్నాడు. కార్తికేయుడు తన మయూరం పై ప్రపంచాన్ని చుట్టేస్తే, గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి వారే తన ప్రపంచం అని చెప్పాడు. ఇక, గణపయ్య తెలివికి మెచ్చిన శివపార్వతులు గణపతికి లడ్డూ ప్రసాదం గా ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి లడ్డూ గణపతికి ప్రీతిపాత్రమైన నైవేద్యంగా మారింది. గణపతికి కూడా లడ్డూ అంటే ఎంతో ఇష్టమని చెబుతున్నారు. అందుకే ఆ విఘ్నేశ్వరుని చేతిలో లడ్డూ ఉంటుంది. ఈ తరుణంలో సాక్షాత్తు ఆ శివపార్వతులు వినాయకుడికి ఇచ్చిన ప్రసాదం కోసం భక్తులు సైతం పోటీపడి కొనుగోలు చేస్తుంటారు.

నోట్: పైవార్తలోని సమాచారం పలువురు పండితులు చెప్పిన అంశాల ఆధారంగా సేకరించింది మాత్రమే. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు. దీనిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Next Story