విజయవాడ దుర్గమ్మ బంగారం ఎస్‌బీఐలో డిపాజిట్‌

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-08 02:45:41  IST  )

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.

విజయవాడ దుర్గమ్మ బంగారం ఎస్‌బీఐలో డిపాజిట్‌
X

దిశ,వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని కానుకలు చెల్లించి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ మేరకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన 29.510 కిలోల బంగారాన్ని ఆలయ అధికారులు సోమవారం గాంధీనగర్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) బ్రాంచ్‌లో డిపాజిట్‌ చేశారు.

డిపాజిట్‌ చేసిన బంగారం విలువ రూ.26.58 కోట్లు ఉంటుందని ఆలయ ఈవో శీననాయక్ తెలిపారు. దీనిపై సంవత్సరానికి 0.60 శాతం వడ్డీ ఆలయానికి లభిస్తుందని‌ తెలిపారు. నగల నిర్ధారణ అధికారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పల్లంరాజు, పర్యవేక్షకుడు సుబ్రహ్మణ్యం, దుర్గ గుడి ఏఈవోలు చంద్రశేఖర్, రమేష్‌బాబు తదితరుల సమక్షంలో బంగారాన్ని బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి సారే సమర్పించేందుకు భారీ సంఖ్యలు భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో విజయవాడ దుర్గమ్మ గుడిలో సేవ చేయాలనుకునే భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. తమ పేర్లను నమోదు చేసుకోవడానికి రాజగోపుర ప్రాంగణంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, త్వరలో ఆన్‌లైన్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో శీనానాయక్ తెలిపారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు దర్శనం, వసతి, భోజన సదుపాయాలు గుడి నిబంధనల ప్రకారం ఉంటాయి. టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 9099కు ఫోన్ చేసి మరిన్ని వివరాల తెలుసుకోవచ్చన్నారు.

Next Story