నేడే రథ సప్తమి.. విశిష్టత, పూజ విధానం

by Yella Dhawani Reddy |

ప్రతి ఏడాది మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే సప్తమిని హిందువులు రథ సప్తమిగా జరుపుకుంటారు.

నేడే రథ సప్తమి.. విశిష్టత, పూజ విధానం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఏడాది మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే సప్తమిని హిందువులు రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేక్ష దైవమైన ఆ సూర్య భగవానుడి ఆరాధిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 7:56 గంటల నుంచి సప్తమి ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున 5:29 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రథ సప్తమి విశిష్టత, పూజ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం కశ్యప మహర్షి, అదితి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించినట్లు చెబుతారు. అంతేకాదు, ఈ రోజునే సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథంపై ఎక్కి విశ్వానికి కాంత్రిని ప్రసరింపచేశాడని అంటారు. ఈ పవిత్రమైన రోజున నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజున తలపై ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రేగు పండ్లు ఉంచుకుని నీటితో తలస్నానం చేసి, సూర్యుడిని అర్ఘ్యం సమర్పిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

పూజా విధానం:

బ్రహ్మ ముహూర్తంలో లేసి తల స్నానం చేయాలి. పసుపు రంగు దుస్తులు ధరించి సూర్య దేవుడిని పూజించాలి. పూజలో ఎర్రని పూలు, అక్షత, నువ్వులు, బెల్లం, చందనం సమర్పించాలి. సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి రాగి పాత్రలో నీరు, బెల్లం, ఎర్రటి పువ్వులు, నువ్వులు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు 'ఓం ఘృణీయా సూర్యాయ నమః' మంత్రాన్ని జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. హిందువులు ఏ దేవుడి పూజ చేసినా ముందుగా గణపతి పూజ చేస్తారు. వినాయకుడి పూజ పూర్తిచేసిన తర్వాత ఉద్వాసన చెప్పేసి.. సూర్యభగవానుడి పూజ ప్రారంభించాలి. పూజ గదిలో చిక్కుడు ఆకులు, చిక్కుడు పూలు, చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపం లాగా తయారుచేసుకోవాలి. ఆ మండపం దగ్గర సూర్యుడి ఫొటో ఉంచాలి. కుదరకపోతే పూజ గదిలో ఒక తమలపాకు తీసుకుని దానిపై గంధంతో రథాన్ని గీయాలి. దానిని సూర్యుడిగా భావించి, పూజించండి. ఇక సూర్య భగవానుడికి గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి. వీలైతే ఆవు పాలతో పాయసం చేస్తే మంచిది.

దానం ఇవ్వాల్సినవి

సూర్యుడికి ఇష్టమైన రథ సప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Next Story