- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ugadi festival: ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి.. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి!
ఉగాది అంటే కొత్త ఆరంభం. ఈ రోజు పంచాంగ శ్రవణం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఉగాది అంటే కొత్త ఆరంభం. మార్చి 19, 2026 నుంచి నూతన సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమైంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగింటి పండుగల్లో ఉగాది పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఉగాది రోజు అందరి ఇళ్లల్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఇంటిల్లిపాది ఈ రోజు తెల్లవారుజామున మేల్కొని ఇంట బయట శుభ్రం చేసుకుంటారు. అనంతరం ఇంటిని పచ్చని మామిడి తోరణాలతో అలంకరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉగాది పచ్చడి తయారు చేసి కుటుంబ సభ్యులందరూ కలిసి స్వీకరిస్తారు. ఆ తర్వాత అందరూ ఒకే దగ్గర కూర్చొని పంచాంగ శ్రవణం వింటారు.
అయితే, ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సాయంత్రం ఆలయాల్లో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉగాది పండుగ రోజున పండితులచే నూతన సంవత్సర పంచాంగంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను వినడాన్ని పంచాంగ శ్రవణం అంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరు పంచాంగ శ్రవణం తప్పకుండా వినాలని పండితులు చెబుతున్నారు. ఇందులో కొత్త సంవత్సరంలో పంటలు ఎలా పండుతాయి? వర్షాలు సమృద్ధిగా కురుస్తాయా? అనే వివరాలతో పాటు వ్యక్తిగత రాశి ఫలాలు(విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం) కూడా ఉంటాయి. ఈ విధంగా రానున్న రోజుల్లో ఏమి జరగనుందో ముందుగా తెలుసుకుని తదనుగుణంగా ప్రణాళిక వేసుకుంటారు. అంతేకాదు, గతాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును ఆహ్వానిస్తూ, జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కోవాలనే స్పూర్తిని పంచాంగ శ్రవణం అందిస్తుంది
పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి..?
తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం అనేది ఒక ముఖ్యమైన సాంప్రదాయం. దీని వెనుక ఆధ్యాత్మిక, సామాజిక మరియు వ్యక్తిగత కారణాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. అందులో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
రాశి ఫలాలు తెలుసుకోవడం
కొత్త సంవత్సరంలో తమ గ్రహగతులు ఎలా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. దీనివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే మార్పులకు ముందుగానే అంచనా వేయొచ్చని పలువురు విశ్వసిస్తారు.
కాలం పట్ల అవగాహన..
పంచాంగం అంటే ఐదు అంగాలు: తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఇందులో తిథి సంపదను ఇస్తుంది. వారం ఆయుష్షును పెంచుతుంది. నక్షత్రం పాపాలను హరిస్తుంది. యోగం రోగ నివారణ చేస్తుంది. కరణం కార్యానుకూలత (పనులు పూర్తి కావడం) కలిగిస్తుంది. వీటి గురించి వినడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
ప్రకృతి, వ్యవసాయం..
పంచాంగంలో ఆ ఏడాది వర్షపాతం ఎలా ఉంటుంది, పంటలు ఎలా పండుతాయి, ఎండలు ఎలా ఉంటాయి వంటి విషయాలను కూడా వివరిస్తారు. ఇది పూర్వ కాలంలో రైతులకు సాగు పనుల ప్రణాళిక వేసుకోవడానికి ఎంతో ఉపయోగపడేది. ఇప్పుడు కూడా రైతులు వర్షాలు ఈ ఏడాది సమృద్ధిగా పండి పంటలు పండుతాయా అని ఎంతో ఆసక్తితో తెలుసుకోవాలనుకుంటారు.
దేశ కాల పరిస్థితులు..
రాజు, గురువులు లేదా సిద్ధాంతులు ఆ సంవత్సర 'నవనాయకుల' (మంత్రులు, సేనాధిపతులు మొదలైన గ్రహాలు) గురించి చెబుతారు. దీనివల్ల దేశంలో రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతలు ఎలా ఉంటాయో ఒక అంచనా వస్తుంది. అంటే, ఇప్పటికే పలు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది ముందుగా తెలుసుకుంటారు.
పుణ్యఫలం..
శాస్త్రాల ప్రకారం, ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేయడం వల్ల గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
నోట్: పైన తెలిపిన సమాచారం జ్యోతిష్య నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు.






