కాళేశ్వరంలో ఆధ్యాత్మిక వైభవం.. ఐదో రోజుకు చేరిన అంత్య పుష్కరాలు

by Kema Shiva Kumar |

సరస్వతి నది అంత్య పుష్కరాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

కాళేశ్వరంలో ఆధ్యాత్మిక వైభవం.. ఐదో రోజుకు చేరిన అంత్య పుష్కరాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం (Kaleshwaram)లో సరస్వతి నది అంత్య పుష్కరాలు (Saraswati River Antya Pushkaralu) వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ్టితో పుష్కర మహోత్సవారలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా త్రివేణి సంగమ క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరానికి తరలివస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమానికి చేరుకుంటున్న పుణ్యస్నానాలు ఆచరించి, నదీ తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా భక్తులు నదిలో దీపాలు వదులుతూ, తమ పితృ దేవతలకు పిండప్రదానాలు, తర్పణాలు అర్పిస్తున్నారు. అనంతరం నదీ మాతకు అర్ఘ్యప్రదానాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. పుష్కర ఘాట్ సమీపంలో ప్రతిష్టించిన సరస్వతి దేవి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక హారతులు ఇస్తున్నారు.

ఆలయాల్లో పెరిగిన రద్దీ..

పుష్కర స్నానాల అనంతరం భక్తులు ప్రసిద్ధ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు, స్థానిక పోలీసులు ఘాట్లు, ఆలయ పరిసరాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.

Next Story