- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాఘ మాసం ఎప్పుడు వస్తోంది.. విశిష్టత ఏంటి?
హిందువులు కార్తీక మాసం తర్వాత అంతా ప్రాముఖ్యత మాఘ మాసానికి ఇస్తారు.

దిశ, వెబ్ డెస్క్: హిందువులు కార్తీక మాసం తర్వాత అంతా ప్రాముఖ్యత మాఘ మాసానికి ఇస్తారు. మఘ నక్షత్రంలో చంద్రుడు ఉండే కాలం కనుక కూడా దీనికి మాఘ మాసం అనే పేరు వచ్చింది. అంతేకాదు, ఈ నెలలోనే ఆ పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడని ప్రతీతి. ఇక సంస్కృతంలో మాఘం అంటే యజ్ఞం అని అర్థం. అందుకే యజ్ఞయాగాది క్రతువులకు ఈ మాసం ఎంతో శ్రేష్ఠమైనదిగా పండితులు చెబుతుంటారు. ఈ ఏడాది జనవరి 29 నుంచి మాఘ మాసం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మాఘ మాసం విశిష్టత తెలుసుకుందాం.
మాఘ మాసంలో నదీ స్నానం విశిష్టత
మాఘ మాసంలో నదీ స్నానం ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. మాఘస్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని విశ్వసిస్తారు. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణంలో సైతం వివరించారు. మృకండు మహర్షి-మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని చెబుతారు. మరో పురాణ కథనం ప్రకారం.. పూర్వం ఓ గంధర్వుడు ఉండేవాడు. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొన్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటంలేదని అన్నాడు. గంధర్వుడి వ్యథను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందు వల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేసి, దానధర్మాలు చేస్తే పాపాలు, వాటి వల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని చెప్పాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారయిందని చెబుతారు. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు.
మాఘ మాసంలోని పండుగలు
* వంసత పంచమి: మాఘ శుద్ధ పంచమి రోజున హిందువులు వసంత పంచమి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ రోజున సరస్వతీ దేవి జన్మించిందని చెబుతుంటారు.
* రథసప్తమి: ఈ రోజున సూర్య భగవానుడు జన్మించాడని చెబుతారు. రథ సప్తమి రోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిదని హిందువులు నమ్ముతారు.
* భీష్మాష్టమి: మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు స్వచ్చంద మరణం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మాఘస్నానానంతరం భీష్మునికి తర్పణం చెయ్యాలి.
* భీష్మ ఏకాదశి: భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి అని అర్థం. భీష్ముని మీద గౌరవం వల్ల ఈ ఏకాదశిని ఆయన పేరుతో పిలుస్తారు.
* మాఘపూర్ణిమ: సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ 'మాఘ పూర్ణిమ' అత్యంత విశేషమైనది. దీనిని మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజు శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది.
మాఘమాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు
ఈ మాసంలో ముల్లంగి దుంపలను తినకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. వీలైనంత వరకు మంచంపై పడుకోకూడదు. ఇక ఈ మాసంలో నువ్వుల్లో చక్కెరను కలుపుకునే తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు నువ్వులను ఇతరులకు దానం చేస్తే పుణ్యం దక్కుతుంది.






