- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Saleswaram: నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం
దక్షిణాది అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం (Saleshwaram) జాతరకు సర్వం సిద్ధమైంది.

దిశ, వెబ్ డెస్క్: దక్షిణాది అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం (Saleshwaram) జాతరకు సర్వం సిద్ధమైంది. ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు.. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలివస్తుంటారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో నల్లమల్ల (Nallamalla) అడవుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక అటవీ అధికారులు, చెంచు సంఘాల నాయకులు అడవి మార్గంలో, ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసరప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించామని అధికారులు తెలిపారు.
ఇక నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool District) లింగాల మండలంలోని దట్టమైన అడవిలో జరిగే ఈ సలేశ్వరం జాతరకు వెళ్లాలంటే గుట్టలు, లోయల్లో సాహస యాత్ర చేయాల్సిందే. ఎత్తయిన కొండలు.. దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజసిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ.. 4 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి లింగమయ్యను దర్శించుకోవాలి. అందుకే అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు సలేశ్వరం జాతరకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తుంటారు.
సలేశ్వరం ఎలా చేరుకోవాలంటే?
శ్రీశైలం-హైదరాబాద్ రహదారిలో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్లాలి. 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరం వెళ్లగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. నిజాం విడిది నుంచి ఎడమవైపున 23 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వ రం బేస్‌క్యాంపు వస్తుంది. అక్కడ రాంపూర్ చెంచుపెంట వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి. అక్కడి నుంచి సలేశ్వరం జలపాతం చేరుకోవడానికి 4 కిలోమీటర్ల దూరం నడవాలి. అలాగే, లింగాలలోని కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్దతేరును భక్తులు దర్శించుకొని లింగాల నుంచి వయా అప్పాయిపల్లి మీదుగా గోర్జా గుండాల వరకు వాహనాల ద్వారా.. అటు నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన సలేశ్వరంకు వెళ్లొచ్చు.
ప్రత్యేక బస్సులు
సలేశ్వ రం క్షేత్రానికి నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అధికారులు నడిపిస్తున్నారు. అచ్చంపేట నుంచి మొదటి బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుండగా, చివరి బస్సు సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. ఈ బస్సు ద్వారా అప్పాపూర్ పెంటకు చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో సలేశ్వరం వెళ్లవచ్చు.






