తిరుమలలో భక్తుల రికార్డు: 2025-26 లో పెరిగిన శ్రీవారి దర్శనాలు

by Malleboina Mahesh |

2025-26లో శ్రీవారి దర్శనాల రికార్డు! రోజుకు 73 వేల మందికి దర్శనం. హుండీ ఆదాయం నెలకు ₹120 కోట్లు దాటింది. లడ్డూ విక్రయాల్లో 12.6% వృద్ధి.

తిరుమలలో భక్తుల రికార్డు: 2025-26 లో పెరిగిన శ్రీవారి దర్శనాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి కొండ (Tirumala Tirupati Hill)పై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి దర్శనాలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత రెండేళ్లతో (2023-24, 2024-25) పోలిస్తే భక్తుల రాకలో గణనీయమైన వృద్ధి కనిపించిందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

గత రెండేళ్లలో రోజుకు సగటున 70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 2025-26లో ఆ సంఖ్య 73,000కు చేరుకుంది. అంటే గతంతో పోలిస్తే దర్శనాల్లో 4.57 శాతం వృద్ధి నమోదైంది. అలాగే భక్తుల రద్దీ కి తగ్గట్టుగానే ఆదాయం కూడా రికార్డు స్థాయిలో ఉంది. గడిచిన ఆరు నెలల కాలంలో ప్రతి నెలా హుండీ ఆదాయం రూ. 120 కోట్లకు పైగా రావడం విశేషం. శ్రీవారి ప్రసాదమైన లడ్డూ విక్రయాల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే లడ్డూల విక్రయాలు 12.6 శాతం వృద్ధి సాధించాయి.

మెరుగైన సౌకర్యాలే కారణమా?

భక్తుల రద్దీ పెరుగుతున్నా, టీటీడీ తీసుకున్న ముందస్తు చర్యలు, క్యూలైన్ల నిర్వహణ, టెక్నాలజీ వినియోగం వల్ల దర్శన సమయం తగ్గిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న నిబంధనలు ఈ రికార్డు స్థాయి దర్శనాలకు దోహద పడినట్లు తెలుస్తుంది. రానున్న రోజుల్లో భక్తుల సౌకర్యార్థం మరిన్ని వసతులను మెరుగుపరచనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story