ఒక యోగి ఆత్మకథ.. ఘనంగా యోగానంద జయంతి సంబరాలు.. ఆయన జీవిత విశేషాలు ఇవే

by Ramesh Naini |

యోగదా సత్సంగ సొసైటీ (వై.ఎస్.ఎస్.) వ్యవస్థాపకుడు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి.

ఒక యోగి ఆత్మకథ.. ఘనంగా యోగానంద జయంతి సంబరాలు.. ఆయన జీవిత విశేషాలు ఇవే
X

దిశ, డైనమిక్ బ్యూరో: యోగదా సత్సంగ సొసైటీ (వై.ఎస్.ఎస్.) వ్యవస్థాపకుడు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా ఇవాళ(సోమవారం) హైదరాబాద్, తిరుపతిల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ మధురానగర్‌లోని సాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాల్‌లో వైఎస్ఎస్ భక్తులు క్రియా యోగ ధ్యానం, భజనలు, పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి నలందా నగర్‌లో నూతన ధ్యాన మందిరాన్ని వైఎస్ఎస్ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి స్మరణానంద మాట్లాడుతూ, అజ్ఞానమనే చీకటిని తొలగించే వాడే గురువని అన్నారు. భగవంతుడి నిశ్శబ్ద స్వరమే గురువని, సాధన అంటే ధ్యానం మాత్రమే కాకుండా దయ, క్షమ, సేవా తత్పరత వంటి మంచి గుణాలను అలవరచుకోవడమేనని తెలిపారు. క్షమాగుణం దైవ లక్షణమని పేర్కొన్నారు.

పరమహంస యోగానంద జీవిత విశేషాలు

పరమహంస యోగానంద 1893 జనవరి 5న గోరఖ్‌పూర్‌లో ముకుంద లాల్ ఘోష్‌గా జన్మించారు. చిన్ననాటి నుంచే ప్రార్థన, ధ్యానాలపై ఆసక్తి చూపిన ఆయన, ఆధ్యాత్మిక అనుభూతులను పొందారు. 1910లో తన గురువు స్వామి శ్రీయుక్తేశ్వర్‌ను కలుసుకుని కఠినమైన ఆధ్యాత్మిక శిక్షణ పొందారు. అనంతరం సన్యాసం స్వీకరించి పరమహంస యోగానందగా ప్రసిద్ధి చెందారు. 1917లో రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించిన ఆయన, 1920లో అమెరికాలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌ను స్థాపించి క్రియాయోగం, ధ్యానం బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారు.

ఒక యోగి ఆత్మకథ

మతాల ఐక్యత, భగవంతుని ప్రత్యక్ష అనుభూతి సాధ్యమనే సందేశంతో ఆయన చేసిన బోధనలు కోట్లాది మందికి ప్రేరణగా నిలిచాయి. ఆయన రచించిన ఒక యోగి ఆత్మకథ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథంగా విశేష ఆదరణ పొందింది. యోగానంద జయంతి సందర్భంగా ఆయన చూపిన శాశ్వత ఆనంద మార్గాన్ని అనుసరించాలని భక్తులు స్మరించుకున్నారు.

Next Story