Mini Medaram Jatara: ప్రారంభమైన సమ్మక్క-సారలమ్మ మినీ జాతర.. పొటెత్తిన భక్తులు

by Yella Dhawani Reddy |

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సమ్మక్క-సారలమ్మల మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది.

Mini Medaram Jatara: ప్రారంభమైన సమ్మక్క-సారలమ్మ మినీ జాతర.. పొటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సమ్మక్క-సారలమ్మల మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి (ఫిబ్రవరి 12) నాలుగు రోజుల పాటు (ఫిబ్రవరి 15) జాతర జరుగనుంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆదివాసిలు సమ్మక్క-సారలమ్మల మేడారం మహా జాతర నిర్వహిస్తారు. మధ్యలో వచ్చే ఏడాది మాత్రం మినీ జాతరను జరుపుతారు.

ఇక, ఇవాళ మండమెలిగె పండుగతో జాతర ప్రారంభిస్తారు. గద్దెలను శుద్ధి చేసి గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా ఆలయ పూజారులు తొలిరోజు దిష్టి తోరణాలు కడుతారు. పున్నమి వెలుగుల్లో పూజారులు జాగారాలు చేస్తారు. రేపు (గురువారం) మండమెలిగె పూజలు, ఎల్లుండి (శుక్రవారం) భక్తుల మొక్కుల చెల్లింపు, శనివారం చిన్న జాతర నిర్వహిస్తారు. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.30 కోట్లతో ఏర్పాట్లు చేసింది. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసింది. అలాగే జంపన్నవాగు వద్ద జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు గదులను, క్యూలైన్లలో తాగునీరు, చలవ పందిళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ 200 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి తర్వాత వనదేవతలను దర్శించుకుంటున్నారు. గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం సమర్పించారు. దీంతో మేడారం ప్రాంతాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. కాగా చిన్న జాతర ముగిసిన మరుసటి రోజు ఆదివారం సెలవు కావడంతో భక్తులు వనదేవతల దర్శనానికి భారీగా తరలివచ్చారు.

Next Story