Magha Pournami: ఇవాళే మాఘ పౌర్ణమి.. ఈ పనులు అస్సలు చేయకండి!

by D.Reddy |   ( Updated:2025-02-12 04:28:07.0  )
Magha Pournami: ఇవాళే మాఘ పౌర్ణమి.. ఈ పనులు అస్సలు చేయకండి!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది. అయితే, అన్ని పౌర్ణమిలలోకెల్లా మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు హిందువులు. ఈ పౌర్ణమిని 'మహామాఘి' అని కూడా అంటారు. ఇక ఈరోజున నది స్నానం చేస్తే స్వర పాపాలు తొలగించి, ముక్తి లభిస్తుందని నమ్ముతారు. మరి ఈ ఏడారి మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి విధివిధానాలు పాటించాలో తెలుసుకుందాం.

మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే, పురాణాల ప్రకారం మాఘ మాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారని, అందుకే మాఘ స్నానాన్ని ఎంతో గొప్పదానిగా భావిస్తారు. అంతేకాదు, శివకేశవులిద్దరికి ఈ మాసం ఎంతో ఇష్టమైనదిగా చెబుతారు. ఇక ఈ ఏడాది (2025) మాఘ పౌర్ణమి తిథి ఫిబ్రవరి 11న సాయంత్రం 6:55 గంటలకు మొదలై.. ఫిబ్రవరి12న సాయంత్రం 7:22 గంటలకు ముగుస్తుంది. కావున ఫిబ్రవరి 12నే మాఘ పౌర్ణమి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈరోజున బ్రహ్మా ముహూర్తంలో నది, సముద్రం స్నానం చేస్తే శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. కుదరని వారు వారు కనీసం తిలదానమైనా ఇవ్వాలని పండితులు చెబుతున్నారు. తిల దానం అంటే నువ్వులను దానం చేయడం.

పూజా విధానం..

మాఘ పూర్ణిమ రోజు ఉదయాన్నే లేచి ఇంటి శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి పూజాకు సిద్ధం చేసుకోవాలి. పూజలో ఐదు రకాల పండ్లు, పువ్వులు పెట్టాలి. తమలపాకులో పసుపు ముద్ద ఉంచి, ఆ పసుపు ముద్దను గౌరీ దేవిగా భావించి, ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆపై అక్షతలు వేస్తూ 'ఓం శ్రీ గౌరీ దేవ్యై నమః' అనే మంత్రాన్ని 21 సార్లు చదివి, హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహా విష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గౌరీ దేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

చేయకూడని పనులు

మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రపోకూడదు. ఇంటిని కూడా మురికిగా ఉంచకూడదు. మాఘ పూర్ణిమ వేళ నల్లని దుస్తులను ధరించకండి. ఈరోజున ఎవరితోనూ గొడవ పడకూడదు. జంతువులకు హాని తలపెట్టకూడదు. మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులు, జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story

Most Viewed