ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం రేపు.. మనపై ప్రభావం ఉంటుందా ?

by Naga Rani Yarlagadda |

ఏడాదిలో రెండవ, చివరి సూర్యగ్రహణం రేపు. ఈ ఏడాది మార్చి 29న పార్శ్వ సూర్యగ్రహణం (Solar Eclipse) సంభవించగా.. మరో సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడనుంది.

ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం రేపు.. మనపై ప్రభావం ఉంటుందా ?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏడాదిలో రెండవ, చివరి సూర్యగ్రహణం రేపు. ఈ ఏడాది మార్చి 29న పార్శ్వ సూర్యగ్రహణం (Solar Eclipse) సంభవించగా.. మరో సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడనుంది. ఇది కూడా పార్శ్వ గ్రహణమే. అయితే ఈ గ్రహణం సర్వ పితృ అమావాస్య రోజున ఏర్పడుతుంది. సాధారణంగా గ్రహణాలకు ముందు సూతకకాలం ఉంటుంది. రేపు ఏర్పడే సూర్యగ్రహణం భారత్ లో కనిపించదు. మరి మనకు సూతక కాలం వర్తిస్తుందా అంటే.. పండితులు వర్తించదని చెప్తున్నారు. కానీ.. ఆ సమయంలో ఎలాంటి పనులు చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

సూర్య గ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయాన్ని అశుభంగా భావిస్తారు. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి 10.59 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. గ్రహణ శిఖరం ఉదయం 1.11 గంటలకు ఏర్పడుతుంది. తెల్లవారుజామున 3.23 గంటలకు గ్రహణం ముగుస్తుంది. గ్రహణానికి 12 గంటల ముందు అంటే ఆదివారం ఉదయం 10.59 గంటల నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. గ్రహణం ముగిశాక సూతక కాలం ముగుస్తుంది. అయితే.. భారతీయులు మళ్లీ సూర్యగ్రహణాన్ని చూడగలిగేది 2027 ఆగస్టు 2న అని సైంటిస్టులు చెప్తున్నారు. అది కూడా పాక్షిక గ్రహణమే (Partial Solar Eclipse) అని పేర్కొన్నారు.

పాక్షిక సూర్యగ్రహణం అంటే ఎలా ఏర్పడుతుంది?

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపైకి వచ్చినపుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యకు వచ్చినపుడు సూర్యుడు మాయమవుతాడు. దానిని సూర్యగ్రహణంగా పరిగణిస్తాం. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పినపుడు ఆ నీడను ఉంబ్రా అని పిలుస్తారు. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. సూర్యుడిలో కొంతభాగాన్ని మాత్రమే చంద్రుడు కప్పి ఉంచితే దానిని పెనంబ్రా అంటారు. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇక్కడ సూర్యుడి అంచులో కాంతి వలయం (Ring of Fire) కనిపిస్తుంది.

మన దేశంలో ఈ గ్రహణం కనిపించకపోయినా కొన్ని పనులు చేయవద్దని పండితులు సూచిస్తున్నారు. సూతకకాలంలో తినడం, వంట చేయడం, బయట తిరగడం, స్నానం చేయడం, దానధర్మాలు వంటివి చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా మద్యం, మాంసాహారాలకు, గర్భిణులు పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి.

Next Story