- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగ సాధువుల గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతుంది.

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో 144 ఏళ్ల తర్వాత మహా కుంభమేళా జరుగుతుంది. ఈ మహా కుంభమేళాకు వేలాదిగా తరలివస్తున్న నాగ సాధువులు ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా అసలు నాగ సాధవులు అంటే ఎవరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? కుంభమేళా తర్వాత వీరు ఎక్కడికి వెళ్తారు? తదితర ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నాగ సాధవులుగా మారాలంటే..
పురాణాల ప్రకారం శంకరాచార్యుడు నాలుగు మఠాలను స్థాపించిన తర్వాత, వాటి రక్షణ కోసం నాగ సాధువుల బృందాలను ఏర్పాటు చేసినట్లు చెబుతారు. ప్రతి క్షణం శివ నామ స్మరణ చేస్తూ హిందూ ధర్మాన్ని రక్షించటమే పరమావధిగా వీరు జీవిస్తుంటారు. ఒక వ్యక్తి నాగ సాధువుగా మారటం అనేది సవాలుతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. నాగ సాధువు కావాలంటే 12 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేయాలి. ముఖ్యంగా మూడు దశలను దాటాల్సి ఉంది. అందులో తొలి దశ మహా పురుషుడు, రెండవ దశ అవధూతుడు, మూడవ దశ దిగంబరుడు. అలాగే, ముందుగా తనకు తానే పిండదానం చేసుకుని, తర్పణం వదిలేయాలి. అన్ని బంధాలను, సర్వసుఖాలను, విలాసాలను వదిలిపెట్టాలి. ప్రాపంచిక ఆనందంతో సంబంధం లేకుండా జీవించేందుకు సిద్ధపడాలి. జీవితాంతం బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. మహిళలైతే జుట్టును కూడా వదులుకోవాల్సి ఉంటుంది.
నాగ సాధువుల నియామాలు..
నాగ సాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానం చేస్తుంటారు. వీరు ఒంటి మీద నూలు పోగు లేకుండా కేవలం విభూతి రాసుకుని జీవిస్తుంటారు. కాలం ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు దుస్తువులు ధరించరు. అలాగే వీరు రోజులో కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు. అది కూడా రోజుకి ఏడు ఇళ్లలో మాత్రమే భిక్ష అడగాలి అన్న కఠిన నియమాలను పాటిస్తారు. ఆ ఇళ్లలో ఎంత ఆహారం వచ్చిన పడేయకుండా స్వీకరిస్తారు. ఒకవేళ వారు భిక్ష అడిగిన ఇళ్లలో ఆహారం లభించకపోతే ఆ రోజు పస్తులు ఉంటారు.
17 అలంకారాలు ఇవే..
నాగ సాధువులకు ఆధ్యాత్మిక శక్తి, భక్తి తప్ప మరేమీ లేదు. ఎందుకంటే.. నాగ అనే పదానికి 'శూన్యం' అని సాహిత్యపరమైన అర్థం. అయితే నాగ సాధువుల జీవితంలో మాత్రం 17 అలంకారాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి వారు తప్పనిసరిగా కలిగి ఉండాలి. నాగ సాధువుల 17 అలంకారాలు ఇవే.. బూడిద, చిన్న బట్ట, చందనం, కాళ్లకు ధరించేందుకు లోహాంతో చేసిన కడియాలు, పంచకేశ అంటే ఒక జడ ఐదుసార్లు చుట్టబడి ఉండడం, కుంకుమ, ఉంగరం, పూల దండ, చేతుల్లో పటకారు వంటి ఆయుధం, ఢమరు, కమండలం- ధీర్ఘ వృత్తాకారంలో ఉండే పాత్ర, జడలు, తిలకం, మసి బొట్టు, చేతిలో జపమాల, విభూతి, రుద్రాక్ష. నాగ సాధువులు ఈ అలంకారాలు చేసుకున్న తర్వాతే పవిత్ర నదిలో స్నానం, మహా కుంభమేళాలోనూ రాజ స్నానం చేస్తారు.
కఠోరమైన తపస్సు
ఇక వీరు విపరీతమైన చలిలో కూడా నగ్నంగా ఉంటారు. అన్ని ఋతువులకు తమ శరీరం తట్టుకునేందుకు అగ్ని సాధన, నాడీ శోధన, మంత్ర పఠనం వంటి కఠోరమైన తపస్సును నిత్యం చేస్తుండటంతో శరీరం, మనస్సుపై నియంత్రణను పొందుతారు. దీని కారణంగా అన్ని రకాల వాతావరణ పరిస్థితులను నాగ సాధువులు తట్టుకుంటారు. అలాగే, నాగాలు వారి శరీరాన్ని కప్పి ఉంచే బూడిదలో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుంచి కాపాడతాయి.
కుంభమేళా తర్వాతక ఎక్కడికి వెళ్తారు?
ఇక కుంభమేళాలో మాత్రమే కనిపించే ఈ నాగ సాధువులు తర్వాత హిమాలయాలకు, దిగంబరులుగా ఆశ్రమానికి తిరిగి వెళతారు. దిగంబరులకు భూమే పరుపు, ఆకాశం దుప్పటిగా భావిస్తారు. ఇక మరికొంతమంది నాగా సాధువులు కుంభమేళా తర్వాత ప్రముఖ తీర్థక్షేత్రాలలో నివసిస్తారు. ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని వంటి ప్రదేశాలలో వారు ధార్మిక సాధన చేస్తూ ఉంటారు.
ఇక నాగ సాధువులు మరిణించాక సాధారణ మనుషుల్లాగా దహన సంస్కారాలు చేయరు. తమ ప్రాణాలు విడిచి పెట్టే సమయంలో నాగ సాధువులు ధాన్యం చేస్తున్నట్లుగా కూర్చుకుంటారు. అదే చోట వారికి అలాగే సమాధి చేస్తారు. కొంతమంది సాధువుల శరీరాలను పవిత్ర నదుల్లో కలిపేస్తారు.






