తిరుమలలో తగ్గని రద్దీ.. భూదేవి కాంప్లెక్సులో టోకెన్లకై నిరీక్షణ

by Naga Rani Yarlagadda |

తిరుమలలో నాలుగు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమలలో తగ్గని రద్దీ.. భూదేవి కాంప్లెక్సులో టోకెన్లకై నిరీక్షణ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో నాలుగు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 7 గంటల సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లతో పాటు.. నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో నిండిపోగా.. శిలాతోరణం వరకూ క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 18-24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 4-5 గంటల సమయం, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 5-7 గంటల వరకూ సమయం పడుతుందని పేర్కొంది. మరోవైపు అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్సులో, శ్రీవారి మెట్టు, విష్ణునివాసం, శ్రీనివాసం వద్ద ఒకరోజు ముందుగా ఇచ్చే ఉచిత సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లకై భక్తులు వేకువజాము నుంచే భారీగా బారులు తీరారు. రోజుకు 10 వేల టోకెన్లు మాత్రమే ఇస్తుండగా.. ఈ సంఖ్యను పెంచాలని భక్తులు కోరుతున్నారు.

నిన్న (ఆదివారం) కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని 91,793 మంది భక్తులు దర్శించుకోగా.. 31,221 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.4.90 కోట్లు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే 4.38 లక్షల లడ్డూలను విక్రయించారు. 3.13 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు.

Next Story