- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లింగోద్భవ కాలంలో ఈ పనులు అస్సలు చేయకండి..
మాఘ బహుళ చతుర్దశి నాడు అర్థరాత్రి 11 గంటల తర్వాత లింగోద్భవ కాలం మొదలవుతుంది. ఈ సమయంలో కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మహాశివరాత్రి పర్వదినాన అతిముఖ్యమైన సమయం లింగోద్భవ కాలం. పరమశివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన అత్యంత పవిత్రమైన సమయాన్ని లింగోద్భవ కాలంగా పిలుస్తారు. ఈరోజు (ఫిబ్రవరి 15, ఆదివారం) అర్థరాత్రి 12 గంటల 27 నిమిషాల 48 సెకన్ల నుంచి 12 గంటల 34 నిమిషాల 12 సెకన్ల వరకూ లింగోద్భవ కాలమని పండితులు చెప్తున్నారు. ఈ సమయంలో లింగరూపంలో ఉన్న శివుడికి అభిషేకం జరిపిస్తే చాలా పుణ్యఫలం దక్కుతుందని శివమహాపురాణం చెప్తోంది. ఇలా చేసే వీలులేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించినా.. ఆ పంచభూతాత్మకుడి అనుగ్రహం సిద్ధిస్తుంది.
స్కందపురాణం ప్రకారం.. ఒక మహాప్రళయం తర్వాత బ్రహ్మ - విష్ణువుల మధ్య అహంకారం తలెత్తగా.. ఎవరు గొప్పో తేల్చుకునేందుకు యుద్ధానికి సిద్ధమవుతారు. ఒకరిపై ఒకరు పాసుపతాస్త్రాలను ప్రయోగించుకోగా.. పరమేశ్వరుడు మరో ప్రళయం రాకూడదని భావించి రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో మొదలు, మధ్య, చివర తెలియని విధంగా మహా అగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేసి దివ్యదర్శనాన్ని కలిగిస్తాడు. ఆ తర్వాత పుష్కలావర్తక మేఘాలను రప్పించి జలంతో వర్షింపజేసి.. శాంభవనల స్తంభాన్ని చల్లార్చుతాడు. ఇదంతా మాఘమాసంలో బహుళ చతుర్దశిరోజున ఆర్థరాత్రి సమయంలో జరగడంతో లింగోద్భవ కాలంగా పిలుస్తారు. ఈ సమయంలో రుద్రాభిషేకం చేయడం అత్యంత పుణ్యఫలంగా భావిస్తారు.
ఈ లింగోద్భవ కాలంలో కొన్ని చేయకూడని పనులుంటాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా నిద్రించకూడదని సూచించారు. అలాగే అనవసరమైన లౌకిక విషయాల గురించి మాట్లాడకూడదని, బ్రహ్మ, విష్ణువులు గర్వంవీడిన సమయం కాబట్టి కోపం, అహంకారాలను ప్రదర్శించకూడదని పేర్కొన్నారు. అలాగే భోజనం చేయడం, అపవిత్రంగా ఉండటం వంటి పనులు కూడా చేయకూడదన్నారు. అబద్ధాలు చెప్పడం, ఇతరులపై నిందలు వేయడం వంటివి చేయకూడదు. ఈ సమయంలో నిద్రపోవడం వల్ల శివుడి అనుగ్రహం సిద్ధించదని నమ్మకం.






