- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Devotional: రేపే భీష్మ ఏకాదశి.. ఈ పండుగ విశిష్టత, ఎందుకు జరుపుకుంటారు?
హిందువులు ప్రతి ఏటా మాఘ మాసం శుక్ల పక్ష ఏకాదశిని 'భీష్మ ఏకాదశి' అంటారు.

దిశ, వెబ్ డెస్క్: హిందువులు ప్రతి ఏటా మాఘ మాసం శుక్ల పక్ష ఏకాదశిని 'భీష్మ ఏకాదశి' అంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన భీష్మ ఏకాదశి వచ్చింది. ఈ సందర్భంగా ఈ భీష్మ ఏకాదశి ఎందుకు వచ్చింది? దీని విశిష్టత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం.. మహా భారతంలో అత్యంత కీలకమైన పాత్రల్లో భీష్ముడు కూడా ఒకడు. శంతనుడు, గంగా మాతకు పుట్టిన అష్ట వసువుల్లో ఎనిమిదవ కుమారుడు. భీష్ముడు తన తండ్రి అయిన శంతనుడి ద్వారా ఇచ్ఛా మృత్యువును వరంగా పొందాడు. కౌరవుల తరపున మహాభారత యుద్ధంలో పోరాడిన భీష్ముడు శింఖడికి తల వంచి తన శస్త్రాలను త్యజించాడు. అయితే దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణం వచ్చే వరకూ అంపశయ్యపై ఉండిపోయాడు. ఇక మాఘ శుక్ల అష్టమి నుంచి మొదలు పెట్టి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచిపెట్టాడు. భీష్ముడు ప్రాణాలు విడిచిన ఈ ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు. ఆ సమయంలో తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించారు. ఈ సందర్భంగా భీష్మ పంచకం పవిత్రమైన రోజులుగా విరజిల్లుతాయని శ్రీకృష్ణుడు భీష్మ పీతామహుడికి కానుకగా ఇచ్చాడు.
ఇక భీష్మ పితామహుడు మరణకాలంలో సాక్షాత్తు పరమాత్మా అయిన కృష్ణుణ్ణే తన ధర్మవర్తనంతోనూ, తపశ్శక్తితోనూ తన వద్దకు రప్పించుకొని, ఆయన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానంచేసి, మోక్షం పొందాడు. అందుకే ఆ రోజున విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయని హిందువులు నమ్ముతారు. ఇక ఈ భీష్మ ఏకాదశికే జయ ఏకాదశి అని కూడా పేరు. ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం.
పూజ విధానం
భీష్మ ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి, తల స్నానం చేయాలి. పసుపు రంగు దుస్తువులు ధరించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి పటాలను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం 'ఓం నమోనారాయణాయ' అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. అనంతరం పాయసం నైవేద్యంగా సమర్పించాలి.
భీష్మ ఏకాదశి రోజు చేయకూడని పనులివే..
* ఏకాదశి రోజున బియ్యంతో తయారు చేసిన పదార్ధాలను తినకూడదు.
* గొడవలు, తగాదాలు, హింసకు దూరంగా ఉండాలి.
* మద్యం, ధూమపానం, మాంసాహారం వాటికి దూరంగా ఉండాలి.
* వెల్లుల్లి, ఉల్లిపాయ, వంకాయ, తమలపాకు, మాంసాహార పదార్థాలను తినకూడదు.
* భోగభాగ్యాలు, మోసం, జూదం మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి.






