తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం

by Malleboina Mahesh |   (  Updated:2025-10-28 04:33:45  IST  )

కలియుగ దైవం అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం (అక్టోబర్ 28, 2025) భారీ భక్తుల రద్దీ నెలకొంది.

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం (Lord Venkateswara Swamy Temple)లో మంగళవారం (అక్టోబర్ 28, 2025) భారీ భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం 6:15 గంటల సమయానికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో క్యూ కంపార్ట్మెంట్లు దాదాపు నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం భక్తులకు సుమారు 12–14 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3–4 గంటలు, అలాగే నడకదారుల ద్వారా (దివ్య దర్శనం) వచ్చే భక్తులకు 6–8 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఈరోజు ఆలయంలో ఎటువంటి ప్రత్యేక ఉత్సవం, సేవా కార్యక్రమం లేవని TTD అధికారులు వెల్లడించారు. అయితే సాధారణంగా ఉన్నట్లుగానే వసతి గృహాలు, గెస్ట్ హౌస్‌లు, డార్మిటరీలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో వాహన రాకపోకలు సజావుగా కొనసాగుతున్నాయి. దివ్య దర్శనం టోకెన్లు అలిపిరిలో సుమారు 10,000, శ్రీవారి మేట్టులో 5,000 వరకు జారీ చేస్తున్నారని అధికారులు తెలిపారు. తిరుమల కొండపై ఉన్న ప్రసాదం కౌంటర్లు సాధారణంగా పనిచేస్తున్నాయి. ఉదయం నుంచి తిరుమలలో తేలికపాటి వర్షం పడుతోంది. వాతావరణ శాఖ ప్రకారం, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో భక్తులు వర్షానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రెయిన్‌కోట్, గొడుగు తీసుకురావాలని, నాన్‌స్లిప్ పాదరక్షలు ధరించాలని, అలాగే సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రద్దీ తో పాటు వర్షం కారణంగా ఆలయ పరిసరాలు తడిగా ఉండటం తో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story