పన్నులే మనదేశ ప్రగతి రథ చక్రాలు

by  |
పన్నులే మనదేశ ప్రగతి రథ చక్రాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘సూర్యుడు ధరిత్రి మీదనున్న తేమను గ్రహించి అంతకు వేయి రెట్లు వర్షం రూపంలో ఏ విధంగానైతే తిరిగిస్తాడో, ఆదేవిధంగా రాజు కూడా తన ప్రజల సంక్షేమార్ధం వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించడం కోసమే ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తాడు’ అని రాజు దిలీపుడిని ఉద్దేశించి ‘రఘు వంశం’లో కాళిదాసు అభివర్ణించారు. కాళిదాసు మాటల ద్వారా పాలకులు విధించే పలు పన్నుల పవిత్ర లక్ష్యం ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం, తద్వారా సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడమేనన్నది సుస్పష్టంగా అర్ధమవుతున్నది. పూర్వకాలంలో ప్రజలు పన్నులను బంగారు నాణేలు, పశువులు, ధాన్యం, ముడి సరుకుల రూపంలో, వ్యక్తిగత సేవలు చేయడం ద్వారా కూడా చెల్లించేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ఆదాయపు పన్నును ప్రత్యేకంగా విధించనప్పటికీ, ఆనాటి సమాజంలో ఆదాయం సముపార్జించుకునే వ్యక్తులపైనే వివిధ రకాల పన్నులు విధించేవారు. భారతదేశంలో ప్రాచీనకాలం నుండే ప్రత్యక్ష పన్నులు విధించి, వసూలు చేసే వారనే విషయం మనుస్మృతి ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఆ కాలంలో వర్తకులు, చేతి వృత్తులవారు వారు ఆర్జించిన లాభాలలో ఐదింట ఒక వంతును పన్నుగా బంగారం లేదా వెండి రూపంలో రాజు గారి ఖజానాకు జమ చేయాల్సి ఉండేదని, వ్యవసాయదారులు వారు పండించిన పంట ధాన్యంలో ఆయా పరిస్థితులను బట్టి ఆరోవంతు లేదా ఎనిమిదో వంతు లేదా పదోవంతు ధాన్యాన్ని పన్ను రూపంలో ప్రభుత్వానికి సమర్పించుకోవాల్సి వచ్చేదని తెలుస్తున్నది.

TAX

కళల మీద కూడా

ఆ కాలంలో నటులు, నృత్య కళాకారులు, గాయకులు మొదలైన వారిపై కూడా పన్నులు విధించేవారట. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల కాలానికి సంబంధించిన పన్నుల వ్యవస్థను కౌటిల్యుని ‘అర్ధశాస్త్రం’ సమగ్రంగా వివరించిన విషయం మనందరికీ తెలిసిందే. మౌర్యుల కాలంలో వ్యవసాయ ఉత్పత్తులలో ఆరో వంతును పన్నుగా విధించేవారు. నీరు, ఆక్ట్రాయ్, టోల్ పన్నులు కూడా విధించేవారు. వర్తనం, ద్వారోదయ, యాత్రవేతన, వణిక్పథ్ మొదలైన పేర్లతో మౌర్యుల కాలంలో వివిధ రకాల పన్నులు విధించేవారు. అన్ని రకాల మద్యంపై ఐదుశాతం పన్ను వసూలు చేసేవారు. పన్ను విధింపులో సమానత్వం, న్యాయం తప్పకుండా పాటించాలని, యుద్ధం, కరువు కాటకాల వంటి ఎమర్జెన్సీ సమయంలో పన్ను రేట్లు పెంచవచ్చనీ కౌటిల్యుడు సూచించారు. ప్రభుత్వ ఖజానాకు పన్ను రాబడిని పెంచేందుకు 1860లో బ్రిటిష్ ఇండియా తొలి ఆర్ధిక మంత్రి జేమ్స్ విల్సన్ ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశ పెట్టారు. ఆ చట్టం 24 జూలై, 1860 నాడు గవర్నరు జనరల్ ఆమోదం పొంది, అదే రోజు నుండి అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను చట్టం 1961 అవతరించింది. అందులో భాగంగానే ఆదాయపు పన్ను చట్టం-1992 ఆవిర్భవించింది. చట్టబద్ధత గలిగిన కేంద్రీయ బోర్డు స్థాపించబడింది.

మన దేశ స్థితిగతులు

2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం మొత్తం పన్ను రాబడిలో కార్పొరేట్ ఆదాయ పన్ను 28.1 శాతం, వ్యక్తిగత ఆదాయపన్ను 28.3 శాతం అనగా మొత్తం రెవెన్యూ వసూళ్లలో 56.4 శాతం ప్రత్యక్ష పన్నుల ద్వారానే కేంద్ర ప్రభుత్వ ఖజానాకు జమ కావడం ఆదాయపు పన్ను విభాగం ప్రాముఖ్యతను చెప్పకనే చెబుతుంది. గత రెండు దశాబ్దాల కు సంబంధించిన సమాచారం పరిశీలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయపన్ను వెన్నెముకలా నిలిచిన తీరు కనిపిస్తుంది. 2000-01, 2018- 19కి సంబంధించిన గణాంకాలు ఇలా ఉన్నాయి. ఆదాయపన్ను వసూలు 68,305 కోట్ల రూపాయలు-11,37,685 కోట్ల రూపాయలు), కేంద్ర ప్రభుత్వం మొత్తం రెవెన్యూ వసూలులో ప్రత్యక్ష పన్నుల శాతం 36.31- 54.78, జీడీపీలో ప్రత్యక్ష పన్నుల శాతం 3.25-5.98, ప్రత్యక్ష పన్నుల వసూలుపైన ఖర్చు శాతం 1.36-0.62. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను దాఖలు చేయబడిన మొత్తం ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్య 6,73,57,829 కాగా, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసిన వివిధ రకాల పన్ను మదింపుదారుల సంఖ్య 6,33,18,586, మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 8,45,21,487. గత రెండు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్నుల అసెస్మెంట్ తదితర విషయాలన్నీ ‘ఫేస్ లెస్ అసెస్మెంట్’ అనే పద్ధతిలో నిర్వహిస్తున్న ఆదాయపు పన్ను విభాగం పలువురి మన్ననలు అందుకున్న తీరు అభినందనీయం. టెక్నాలజీని అత్యధికంగా వాడుకుంటూ పౌరులకు అత్యంత విలువైన, పారదర్శకమైన సేవలందిస్తున్న ఆదాయపు పన్ను విభాగం కరోనా సంక్షోభం కాలంలో కూడా పన్ను రిఫండులను త్వరితంగా జారీ చేసి అందరి ప్రశంసలు పొందిన వైనం ఆదర్శనీయం. – మోహన్ లింగబత్తుల, 9398522294


Next Story

Most Viewed