రాష్ట్రం వచ్చాకే ఆలయాల అభివృద్ధి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

by  |
Ramappa
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలోని కట్టడాలు, సంస్కృతి అభివృద్ధి చెందుతున్నాయని, 30ఏళ్ల క్రితమే రామప్పను గుర్తించి ఉంటే తాజ్ మహల్‌కి వచ్చిన గుర్తింపు వచ్చేదని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. రామప్పను యునెస్కో గుర్తింపు వచ్చాక మొదటిసారి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు మంగళవారం రామప్పను సందర్శించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ, తెలంగాణ హెరిటేజ్, టూరిజం అధికారులతో చర్చించారు.

శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రపాలనలో చరిత్రను గుర్తించలేదని, సీఎం కేసీఆర్ పట్టుబట్టి గుర్తింపు సాధనలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇది మా మొదటి ప్రయత్నం మాత్రమేనని, రెండో ప్రయత్నంలో రాష్ట్రంలో మరిన్ని ఆలయాలకు గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఇప్పటి వరకూ రూ.7 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో రూ.15కోట్లు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా రామప్పకు సరి సమానంగా ఉన్న మిగతా ఆలయాలను కలిపి ఓ సర్క్యూట్ గా ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధికి వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రూ.250 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ministar

రామప్ప కట్టడానికి సంబంధించిన ఆలయ విశేషాలు, కట్టడ ప్రాముఖ్యతను వివరిస్తూ సీఎం కేసీఆర్ స్వయంగా లేఖ రాశారని, 21దేశాలను ఒప్పించే విధంగా దీని ప్రభావం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. రామప్ప పరిసర ప్రాంతంలో 27 ఎకరాల సీడ్ కార్పొరేషన్ భూములున్నాయని, వాటిని రాష్ట్రానికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికులు ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా తమ భూములను ఆలయ అభివృద్ధికి ఇవ్వాలని తమకి ప్రభుత్వం అండగా ఉండి న్యాయం చేస్తుందని తెలిపారు.

స్వాతంత్ర్య భారతదేశంలో రెండు రాష్ట్రాల్లోని కట్టడాలకు రాని గుర్తింపు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రామప్ప ఆలయానికి గుర్తింపు వచ్చిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి మాదిరిగా రామప్పను అభివృద్ధి జరగబోతోందని తెలిపారు. యునెస్కో వాళ్లు సూచించిన విధంగా అభివృద్ధి చేస్తామన్నారు.

srinivas goud

రామప్ప గుర్తింపునకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలని, రామప్ప అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. కాకతీయులు ‘త్రి-టి’విధానంలో అభివృద్ధి చేశారని అంటే టెంపుల్, టౌన్, ట్యాంక్‌గా నిర్మించి అభివృద్ధి చేశారన్నారు. రామప్పతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయని, వాటిని కూడా అభివృద్ధి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.


Next Story