అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభం

34

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలను జీహెచ్ఎంసీ షురూ చేసింది. నాలుగురోజుల క్రితం భారీ వర్షంతో వరద ఉధృతికి నగరం మొత్తం అతలాకుతలం అయ్యింది. దీంతో పలువురు వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోగా వేలాది మంది ఇళ్లలోకి నీళ్లు చేరి ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మల్కాజిగిరిలోని వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ వెంటనే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణల కూల్చివేతకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం మల్కాజిగిరి, పటేల్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దగ్గరుండి అక్రమ నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారు.