మేమూ మనుషులమే!

by  |
మేమూ మనుషులమే!
X

దిశ, వెబ్‌డెస్క్: అభిమానం ఉండొచ్చు. కానీ, హద్దులు దాటకూడదు. మనకు ఆనందాన్నిచ్చే వాటిని, అవి అందినపుడే పొందాలి. కానీ, సరైన సమయానికి అందడం లేదని సృష్టించేవారిని నిందించొద్దు. ఎందుకంటే వాళ్లు కూడా మనుషులే..అభిమానించే వారికి వీలైనంత ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి వాళ్లు ఎంతో కష్టపడతారు. వారి కష్టాన్ని గుర్తించకపోయినా ఫరవాలేదు. కానీ, సరైన సమయానికి ఎంటర్‌టైన్‌మెంట్ అందించలేదని వారిని బెదిరించొద్దు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే..సైబర్‌పంక్ 2077 గేమ్ డెవలపర్‌లను చంపేస్తామని ఇప్పుడు కొందరు నెటిజన్‌లు బెదిరిస్తున్నారు.

గేమింగ్ రంగాన్ని తెలుగు పరిశ్రమ అనుకుంటే సైబర్‌పంక్ 2077 గేమ్‌ను బాహుబలి చిత్రంతో పోల్చవచ్చు. ఈ గేమ్‌లో హాలీవుడ్ నటుడు కియాను రీవ్స్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. గేమర్‌లు దీని విడుదల కోసం ఎప్పట్నుంచో కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. నిజానికి ఏప్రిల్ 2020లో విడుదల చేస్తామని సైబర్‌పంక్ యాజమాన్యం ప్రకటించింది. కానీ, కుదరలేదు. ఆ తర్వాత సెప్టెంబర్, నవంబర్, ఇప్పుడు డిసెంబర్‌కు విడుదలను వాయిదా వేశారు. దీంతో కొందరు అభిమానులకు కోపం కట్టలు తెచ్చుకుంది. వారిలో కొందరు సైబర్‌పంక్ 2077 డెవలపర్ అండ్రేజ్ జవాడ్జికీని ట్యాగ్ చేస్తూ చంపేస్తామని బెదిరించారు. దీన్ని ఖండిస్తూ అండ్రేజ్ కూడా ట్వీట్ చేశారు. తాము కూడా అందరి లాంటి మనుషులమేనని, అభిమానులు కొంత సంయమనంతో ఉండటం మంచిదని ట్వీట్‌లో అండ్రేజ్ పేర్కొన్నారు.


Next Story