కేటీఆర్‌పై దాసోజు శ్రవణ్ పాజిటివ్ టాక్

by  |
Congress leader Dasoju Shravan
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. బుధవారం ఐటిఐఆర్, ఉద్యోగ కల్పన అంశాలపై ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ.. కేటీఆర్ ఉద్యోగ కల్పనపై చివరకు తన తప్పును ఒప్పుకున్నందుకు అభినందిస్తున్నామన్నారు. కానీ, వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీలున్న భర్తీ చేయకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహారించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఎవరు అడ్డుపడ్డారో నిరుద్యోగులకు వివరించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో 1.90 లక్షల ఖాళీలు ఉన్నాయని.. 7 ఏళ్ల పాటు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ఉద్యోగాల భర్తీ చేయకుండా ఏం చేశారని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రభుత్వ నోటిఫికేషన్ల జారీ బాగా జరిగిందని, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో పెద్ద ఎత్తున టీచర్ కొలువులు భర్తీ చేశారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్స్ జారీ చేయనందున, కార్పొరేట్ విద్యా వ్యవస్థల ఆగడాలు పెరిగాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి, విద్యుత్, పంచాయతీ శాఖల్లో ఉద్యోగాల భర్తీ విషయంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విమర్శించారు.


Next Story

Most Viewed