గేటెడ్ విల్లాలో నివాసం..ఫోర్ వీలర్ ఉన్న ఇండ్లే టార్గెట్

by  |
గేటెడ్ విల్లాలో నివాసం..ఫోర్ వీలర్ ఉన్న ఇండ్లే టార్గెట్
X

దిశ, క్రైమ్ బ్యూరో : వారంతా కరుడు గట్టిన దొంగలు..నివాసానికి విలాస వంతమైన విల్లాలను ఎంచుకుంటారు. కార్లు ఉన్న ఇండ్లనే టార్గెట్ చేస్తూ పట్ట పగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒక్కసారి దొంగతనానికి బయలుదేరితే, నాలుగైదు రాష్ట్రాలలో దోచుకోవాల్సిందే. ఎంచుకున్న అడ్రస్ అర్థం కాకుంటే, గూగుల్ మ్యాప్ వినియోగించే అంతరాష్ట్ర కరుడుగట్టిన దొంగలను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు.

ఉత్తరప్రదేశ్ మురదాబాద్‌కు చెందిన ఫహీమ్ అలియాస్ ఏటీఎం అలియాస్, ఫమీమ్ అహ్మద్ అలియాస్ ఫహీముద్దీన్ (35) వృత్తి రీత్యా గ్లాస్ కట్టింగ్ వర్క్ చేస్తాడు. పలు హత్యలు, దొంగతనాలు, కిడ్నాప్ కేసుల్లో నిందితుడు. 2013లో మురదాబాద్ జైలులో హత్యాహత్నం, ఆస్తి నేరాలతో శిక్ష అనుభవిస్తున్న మహ్మద్ ముర్ సలీమ్ పరిచయం అయ్యాడు. జైలు నుంచి విడుదల కాగానే హర్యానాలోని గుర్గాన్‌లో గ్లాస్ కటింగ్ వర్క్ ప్రారంభించారు. పలు నేరాలతో సంబంధం ఉండి పరారీలో ఉన్న ఆరిఫ్‌తో కలిసి (2017) దొంగతనాలు చేసేందుకు పక్కా ప్రణాళికను రచించారు. ముగ్గురు కలిసి హైదరాబాద్‌కు వచ్చి, అల్వాల్, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. కాగా దొంగతనం జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించిన సైబరాబాద్ పోలీసులు బయట నుంచి వచ్చిన వారే ఈ దొంగతనాలను చేశారని గుర్తించారు.

విలాసవంతమైన విల్లాలో..
హర్యానా గుర్గాన్‌లో నివసించే ఈ నేరస్తులు ఇతరులెవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు విల్లాలు, ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. వీరు వినియోగించే వాహనాల నెంబరు ప్లేట్‌లను తరుచు మార్చుతూ కార్లలోనే వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ దొంగతనాలకు ఒడిగడుతున్నారు. గుర్ఘాన్ నుంచి బయలుదేరిన వీరు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ మీదుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో కర్నాటక, గోవా మీదుగా గుర్ఘాన్‌కు చేరుకుంటారు. ఈ ప్రయాణంలో దొంగతనాలు చేస్తూ వెళ్తుండేవారు. ముఖ్యంగా కార్లు కలిగిన ఇండ్లలో దోపిడీ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు. అడ్రస్ గుర్తించేందుకు అవసరాన్ని బట్టి గూగుల్ మ్యాప్‌ను కూడా వినియోగిస్తుంటారు. పట్ట పగలే ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ విలువైన బంగారం, నగదును దోచుకెళ్తుంటారు. ప్రజల కదలికలు లేని కాలనీల్లో, లాక్ చేయబడిన ఇండ్లను మాత్రమే ఎంచుకుని దొంగతనాలు చేస్తుంటారు.

36 తులాలు, రెండు ఆయుధాలు స్వాధీనం…
అల్వాల్, మేడ్చల్ పోలీస్ స్టేషన్లలో దొంగతనాల సమయంలో సైబరాబాద్ పోలీసులు గుర్తించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా హర్యానాలోని గుర్గాన్‌లో స్థానిక పోలీసుల సహకారంతో కొన్ని రోజులు అక్కడే మకాం వేశారు. వారి స్థావరాలను గుర్తించిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఎట్టకేలకు ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. సైబరాబాద్ కమిషనరేట్ అల్వాల్, మేడ్చల్ పీఎస్ పరిధితో పాటు చందానగర్ పీఎస్‌లో 3 దొంగతనాలు, రాయదుర్గం పీఎస్ లో 1, సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పీఎస్ 1 దొంగతనాలు చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అంతే కాకుండా, 2017 నుంచి గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, ఏపీ రాష్ట్రాలలో పలు నేరాలకు పాల్పడ్డారు. వీరి నుంచి 36 తులాల బంగారం, రెండు ఆయుధాలు (1 పిస్టల్, 1 తపంచా), రూ.30 వేల నగదు, 12 సెల్ ఫోన్లు, బంగారాన్ని తూకం వేసే మెషిన్, గోల్డ్ మెల్టింగ్ టూల్ కిట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed