లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ (గ్రూప్ 2,3,4 /ఎస్ఐ, కానిస్టేబుల్/జేఎల్.. )

by Disha Web Desk 17 |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ (గ్రూప్ 2,3,4 /ఎస్ఐ, కానిస్టేబుల్/జేఎల్.. )
X

స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ - 2023:

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామ పంచాయతీకి మరో జాతీయ అవార్డు దక్కింది. అన్ని విభాగాల్లో స్వచ్ఛ గ్రామంగా నిలిచినందుకు ఆ గ్రామ సర్పంచి గాడ్గె మీనాక్షిని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ - 2023 పురస్కారానికి ఎంపిక చేసింది. పచ్చదనం, పరిశుభ్రత, 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, సోలార్ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టిన ఆ గ్రామ సర్పంచి ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారు.

ఫిక్కీ సెక్రటరీ జనరల్‌గా శైలేష్ పాఠక్:

ఫిక్కీ కొత్త సెక్రటరీ జనరల్ గా మాజీ ఐఏఎస్ అధికారి శైలేష్ పాఠక్ నియమితులయ్యారు. శైలేష్ పాఠక్ గతంలో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు, ప్రైవేట్ రంగంలోని పలు దిగ్గజ కంపెనీల్లో శైలేష్ విధులు నిర్వర్తించారని ఫిక్కీ తెలిపింది.

భారత్ లోని 9 రాష్ట్రాల్లో పర్యావరణానికి హాని:

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్రాంతాల జాబితాలో మొదటి 50 స్థానాల్లో భారత్‌లోని 9 రాష్ట్రాలు ఉన్నాయి. 2050 లో పర్యావరణానికి హాని కలిగించే 2500 కు పైగా రాష్ట్రాలు, ప్రావిన్సుల్లోని వాతావరణ మార్పులను క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ (ఎక్స్ డీఐ) గణించింది.

వరదలు, అడవుల్లో మంటలను పరిగణనలోకి తీసుకుని పర్యావరణ హానికారకాల ప్రాంతాల వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. పర్యావరణానికి విఘాతం కలిగించే ప్రపంచంలోని మొదటి 50 స్థానాల్లో భారత్ లోని బీహార్ (22), యూపీ (25), అస్సాం (28), రాజస్థాన్(32), తమిళనాడు(36), మహారాష్ట్ర (38), గుజరాత్ (48), పంజాబ్ (50), కేరళ (52) ఉన్నాయి.

2050 నాటికి హాని కలిగించే మొదటి 50 స్థానాల జాబితాలో చైనా, అమెరికా, భారత్ నుంచే 80 శాతం రాష్ట్రాలు ఉండటం గమనార్హం. భారత్‌లోని అస్సాం రాష్ట్రంలో 1990తో పోల్చితే 2050 నాటికి పర్యావరణాన్ని దెబ్బతీసే పరిస్థితులు 330 శాతానికి పైగా పెరగనున్నాయని ఆ నివేదిక తెలిపింది.

2025 నాటికి ప్రపంచ విద్యుత్తులో సగం ఆసియాలోనే వినియోగం:

ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ లో సగం మొత్తాన్ని ఒక్క ఆసియానే వినియోగించుకుంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఏఈ) వెల్లడించింది. చరిత్రలో తొలిసారి 2025 లో ఆసియా ఈ ఘనతను సాధిస్తుందని ఈ మేరకు విడుదల చేసిన భవిష్యత్తు అంచనా నివేదికలో ఐఈఏ ప్రకటించింది.

ఐరోపా సమాఖ్య, అమెరికా, భారత్ లు కలిపి వినియోగించే విద్యుత్ కంటే చైనా ఎక్కు వ కరెంటును ఉపయోగించనుందని ఈ నివేదిక పేర్కొంది. ఆ సమయానికి ప్రపంచ జనాభాలో అయిదో వంతుకు ఆశ్రయమివ్వనున్న ఆఫ్రికా మౌలిక వసతుల కొరత కారణంగా ప్రపంచ విద్యుదుత్పత్తిలో మూడు శాతం కరెంటును మాత్రమే వినియోగించుకుంటుందని ఐఈఏ అంచనా వేసింది.

జకోవిచ్ ఖాతాలో మరో రికార్డు:

టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెన్నిస్ చరిత్రలోనే (పురుషులు, మహిళలు కలిపి) అత్యధిక వారాల పాటు నెంబర్ వన్ గా ఉన్న ఆటగాడిగా అతను రికార్డు బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా 378వ వారం ఇప్పుడు జకోవిచ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గత నెల ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ తో పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ విజయాల రికార్డులో అగ్రస్థానంలో ఉన్న నాదల్ (22)ను అతను సమం చేసిన సంగతి తెలిసిందే.

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ:

ప్రముఖ నటి, భాజపా నేత ఖుష్భూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమె మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖుష్భూ తోపాటు మమత కుమారి, డెలియానా కొంగ్డుప్ ను జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా నామినేట్ చేసింది.


Next Story

Most Viewed