వలస కార్మికుల్ని ఏం చేద్దాం !

by  |
వలస కార్మికుల్ని ఏం చేద్దాం !
X

– పంపేదెలా.. పాసులిచ్చేదెలా?
– ఇతర రాష్ట్రాల్లోని తెలంగాణ కార్మికుల్ని తేవడమెలా?
– నోడల్ అధికారులతో సీఎస్ సమీక్ష

దిశ, న్యూస్‌బ్యూరో: వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో రాష్ట్రంలోనివారిని పంపడంపై కసరత్తు మొదలైంది. ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఇద్దరు నోడల్ అధికారులు (సందీప్ సుల్తానియా, జితేందర్), ముగ్గురు పోలీసు కమిషనర్లు, జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల అధికారులతో సమావేశం జరిగింది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ నిర్మాణం కోసం వచ్చిన సుమారు 1200 మంది కార్మికులు తొలి రైలులో జార్ఖండ్‌లోని హతియాకు వెళ్ళిపోయారు. ఇలాగే రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. వారి వివరాలను తీసుకున్న తర్వాత స్వస్థలాలకు పంపడంపై విధివిధినాల రూపకల్పనపై చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ కార్మికులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నందున వారిని రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లపైనా చర్చ జరిగింది. అనంతరం సాయంత్రానికి పోలీసు శాఖ తరఫున ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ పాస్ పొందడానికి వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది.

మహారాష్ట్రలోని వివిధ నగరాలతో పాటు ముంబయి నగరంలో ఉండిపోయిన తెలంగాణ కార్మికులు ఇక్కడికి రావాలనుకుంటున్నారు కాబట్టి వారిపైన ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం.. సరిహద్దు దగ్గర చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి నడక మార్గం ద్వారానూ రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో కార్మికులు వచ్చేటట్లయితే వారికి నిర్వహించాల్సిన వైద్య పరీక్షలు, వారిని హోం క్వారంటైన్‌లో ఉంచడానికి ఉన్న పరిస్థితులు, అవసరమైతే ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచాల్సి వస్తే జిల్లాల్లో ఉన్న సౌకర్యాలు తదితరాలపైనా చర్చించినట్లు తెలిసింది. ఎక్కువగా జిల్లాల నుంచి వెళ్ళిన కార్మికులే కాబట్టి వారిని తీసుకొస్తే ఆయా జిల్లాల్లో ప్రస్తుతం ఎన్ని క్వారంటైన్ కేంద్రాలు ఉన్నాయి, ఎంతమందిని అందులో ఉంచవచ్చు తదితర వివరాలన్నింటినీ జిల్లా యంత్రాంగం నుంచి తెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

మమ్మల్ని తీసుకెళ్ళండి : ముంబయిలోని తెలంగాణ కార్మికులు

కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో ముంబయి నగరంలో ఉండిపోయిన తెలంగాణ కార్మికులు స్వస్థలాలకు రావడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ ముంబయికర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బడ్డి హేమంత్ కుమార్ ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. లాక్‌డౌన్ వచ్చినప్పటి నుంచి రోజువారీ పనులు ఆగిపోయాయని, పొట్ట నింపుకోవడం కష్టమవుతోందని, చాలా నిరాశా నిస్పృహల్లో ఉన్నారని, వారిని ప్రత్యేక బస్సులు పెట్టి స్వస్థలాలకు తరలించాలని కోరారు. రోజుకూలీ చేసుకుని బ్రతికే వీరు ముంబయిలో అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటివారిని గుర్తించడానికి వీలుగా మొబైల్ యాప్‌ను రూపొందించి పేర్లను, ఆధార్ కార్డు నెంబర్లను, ఇతర వివరాలను ప్రభుత్వం సేకరించాలని సూచించారు. ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులుగా, రిలయన్స్ పవర్ సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా, ఇళ్ళల్లో పనిమనుషులుగా ఉన్నారని పేర్కొన్నారు.

ముంబయి నగరంతో పాటు భివండి, వర్లి, బోరివలి, కుర్ల ప్రాంతాల్లో ఎక్కువగా తెలంగాణ కార్మికులు కేంద్రీకృతమై ఉన్నారని వివరించారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, సూర్యాపేట, నకిరేకల్, వరంగల్, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, కరీంనగర్ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారని, స్వస్థలాలకు రావడానికి సిద్ధంగా ఉన్నవారికి రోజుకు వంద చొప్పున బస్సులు సరిపోతాయని పేర్కొన్నారు. ముంబయి నగరంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ధారవి మురికివాడలో సైతం తెలంగాణ కార్మికులు సుమారు మూడు వేల మంది ఉన్నారని, ఇప్పటివరకు వీరికి కరోనా పాజిటివ్ రాలేదని, కానీ భయం మాత్రం ఎక్కువగా ఉందని ‘దిశ’కు హేమంత్ కుమార్ వివరించారు. కొద్దిమంది కుటుంబాలతో ఉంటున్నా చాలా మంది తెలంగాణ కార్మికులు కుటుంబాలను స్వస్థలాల్లోనే వదిలేసి పురుషులు ఒంటరిగానే ఉంటున్నారని తెలిపారు.

Tags: Telangana, Migrant workers, stranded in other states, Nodal Officers, CS meeting


Next Story