ఛేజ్ చేశారా.. కాపు కాశారా.? పొంతన లేని పోలీసుల మాటలు

by Sridhar Babu |
vaman rao murder incident
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సెన్సెషనల్ మర్డర్ అయిన హైకోర్టు అడ్వోకేట్ దంపతుల గట్టు వామన్ రావు, నామగణిల హత్య విషయంలో పోలీసుల ప్రకటనలు పొంతన లేకుండా ఉన్నాయి. ఓ వైపున ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్మి పోస్తున్నా పోలీసు అధికారులు అలా వ్యవహరించడం వెనక ఆంతర్యం ఏంటో అంతు చిక్కడం లేదు. ఈ నెల 17 బుధవారం మధ్యాహ్నం రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వచర్ల సమీపంలో కారులో ప్రయాణిస్తున్న వామన్ రావు దంపతులను కత్తులతో దాడి చేసి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీధర్ బాబు రామగుండం సీపీని టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు. పెద్దపల్లి ఆసుపత్రి వద్ద కూడా ఆయన పోలీసు అధికారులను తీవ్రంగా మందలించారు. అప్పటికే ఇష్యూ సీరియస్ అవుతోందన్న విషయం అందరికీ అర్థం అయిపోయింది.

సాక్ష్యానికి ఆమె మాటలు సరిపోవా..?

అదేరోజు రాత్రి రామగుండం సీపీ సత్యానారాయణ మీడియాతో మాట్లాడుతూ వామన్ రావు దంపతులు ప్రయాణిస్తున్న కారును ఛేజ్ చేసి అడ్డగించి వారిద్దరిని అతి కిరాతకంగా చంపేశారని ప్రకటించారు. అయితే అప్పటికే ఘటనా స్థలంలో ఉన్న కొందరు రక్తపు మడుగులో పడి ఉన్న వామన్ రావుకు ప్రశ్నలు వేస్తూ వీడియో తీశారు. ఈ వీడియోలో ఓ మహిళ మాట్లాడుతూ నిందితులు చాలా సేపటి నుండి ఘటనాస్థలానికి కొద్ది దూరంలో కారులోనే ఉన్నారని చెప్పింది. అయినా సీపీ మాత్రం నిందితులు ఛేజ్ చేశారని ప్రకటించారు. ఆ తరువాత ఐజీ నాగిరెడ్డి మీడియాతో మాట్టాడుతూ… గట్టు వామన్ రావు చివరి సారిగా మాట్లాడిని వీడియో తీసిన వారు సహకరించాలని కోరారు. వీడియో తీసిన వ్యక్తిని సాక్ష్యంగా చూపాలనుకుంటున్న పోలీసులు అదే వీడియోలో ఉన్న మహిళ మాటలను పరిగణించడం లేదని సీపీ మాటల్లో స్పష్టం అవుతోంది.

రెండు కార్లు ఎందుకు వాడారు..?

కుంట శ్రీనివాస్ తన కారును కుమార్ కు ఇచ్చి బిట్టు శ్రీను కారును తీసుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. కుమార్.. వామన్ రావు కదిలకలను కుంట శ్రీనుకు ఎప్పటికప్పుడు చేరవేశాడని, కల్వచర్ల శివారులో వామన్ రావు కారుకు తమ కారును అడ్డంగా పెట్టిన నిందితులు దారుణంగా హత్య చేశారని ఐజీ చెప్పారు. వామన్ రావు కారు మూవ్ మెంట్ తెలుసుకునేందుకు వారిని వెంటాడింది ఎవరు? హత్య స్థలానికి ముందు కారు పార్క్ చేసుకుని వెయిట్ చేసింది ఎవరూ అన్న విషయంపై క్లారిటీగా చెప్పడం లేదు. దీంతో అయోమయం గందరగోళంగా పోలీసుల ప్రకటనలు ఉంటున్నాయి. సీపీ సత్యనారాయణ దాదాపు మర్డర్ జరిగిన నాలుగు గంటల తరువాత మీడియాతో మాట్లాడారు. అప్పటికీ క్రైంపై క్లారిటీ రాకపోవడం ఏంటన్నది అర్థం కాకుండా పోయింది. క్షేత్ర స్థాయి అధికారులు ఈ సమాచారాన్ని సేకరించడంలో విఫలం అయ్యారా లేక సీపీకి క్లారిటీగా చెప్పడంలో వెనకడుగు వేశారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

విచిత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు

మరో వైపున పోలీసులు సాధారణంగా క్రైం జరిగినప్పుడు సంబంధిత స్టేషన్ పరిధిని ఉద్దేశించి మాట్లాడుతారు. కానీ రామగుండం సీపీ విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో, ప్రెస్ మీట్లో అయినా మంథనికి 16 కిలో మీటర్ల దూంరంలో వామన్ రావు దంపతుల హత్య జరిగిందని ప్రకటించారు. రామగిరి పోలీస్ స్టేషన్ కు 3 కిలో మీటర్ల దూరంలో ఘటన జరిగిందని చెప్పకుండా మంథనికి 16 కిలోమీటర్ల దూరం అని చెప్పడం ఏంటీ అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎఫ్ఐఆర్ లో కూడా స్టేషన్ కు ఏ దిక్కున ఎంత దూరంలో ఘటన జరిగిందని రాస్తుంటారు పోలీసులు. కానీ వామన్ రావు దంపతుల హత్య విషయంలో మాత్రం సంబంధంలేని ప్రాంతం నుండి డిస్టెన్స్ చెప్పడం విచిత్రంగా ఉంది.

లాజికా… మ్యాజికా..?

బిట్టు శ్రీను, కుంట శ్రీనివాస్ లు మర్డర్ కు ముందు 25 సార్లు ఫోన్లు మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీరిలో పోలీసు అధికారులతో టచ్ లో ఉన్నవారెవరు అన్న విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఎక్కువగా రెగ్యూలర్ కాల్స్ మాట్లాడకుండా వాట్సప్ కాల్స్ కే ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది. ఎవరికీ చిక్కకుండా ఉంటామని భావించి ప్రీ ప్లాన్డ్ గా పోలీసు అధికారుటు నిందితులతో వాట్సప్ కాల్ లో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. టెక్నికల్ గా చట్టానికి చిక్కకుండా ఉంటామని బావించి వాట్సప్ కాల్ ఆయుధంతో ముందుకు సాగారని మంథని ప్రాంతంలో చర్చించుకుంటున్నారు. అయితే పోలీసు అధికారులు ఈ విషయంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.

Advertisement

Next Story