చైల్డ్ ​పోర్నోగ్రఫీ నేరాల్లో దేశంలోనే హైదరాబాద్ టాప్.. భయపెడుతోన్న గణంకాలు..!​

by Disha Web Desk 19 |
చైల్డ్ ​పోర్నోగ్రఫీ నేరాల్లో దేశంలోనే హైదరాబాద్ టాప్.. భయపెడుతోన్న గణంకాలు..!​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విశ్వనగరంగా చెప్పే హైదరాబాద్​చైల్డ్ ​పోర్నోగ్రఫీ నేరాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ వీడియోలను చూడటానికి అలవాటు పడ్డవారిలో కొందరు వాట్సాప్​గ్రూపుల్లో షేర్​ చేస్తుండగా మరికొందరు వేర్వేరు సెర్చ్​ ఇంజన్ల నుంచి చైల్డ్​పోర్నోగ్రఫీకి చెందిన వీడియోలను సేకరించి వేర్వేరు ప్లాట్​ఫాంలలో అప్​లోడ్ ​చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం.

దీనిని అరికట్టటానికి నోడల్ ​ఏజన్సీగా వ్యవహరిస్తున్న రాష్ర్ట సీఐడీ శాఖ అంతర్జాతీయ సంస్థలు, టిప్​లైన్ ​ద్వారా అందుతున్న ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి కొందరిని అరెస్టులు చేస్తున్నా ఈ తరహా నేరాలు పెరిగిపోతున్నాయి తప్పితే తగ్గుముఖం పట్టటం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే వీటిని చూడటానికి అలవాటు పడుతున్న వారు క్రమంగా మానసిక రోగులుగా మారుతున్నారు. ఇంకొందరు వీటి ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నారు.

అరచేతిలోకి వచ్చేసిన ఆండ్రాయిడ్.. ఐఫోన్లు..

అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ ​సానుకూలంగా ఉపయోగించుకుంటున్న వారికి ప్రయోజనాలు కలిగిస్తుంటే దుర్వినియోగానికి వాడుతున్న వారిని తప్పుడు దారులు పట్టిస్తోంది. సైకాలజిస్ట్​ అయిన డాక్టర్​ గోపీ చెప్పిన ప్రకారం మొబైల్​ ఫోన్లలో ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటున్న వారిలో 15 నుంచి 30 సంవత్సరాలలోపు వయసున్న వారే అధికంగా ఉన్నారు. వీళ్లల్లో చాలామంది పోర్న్​సైట్లు చూడటం మొదలుపెట్టి కొన్ని రోజుల్లోనే దానికి బానిసలుగా మారుతున్నారు. వీరిలో కొందరు చూడటంతో ఆగక వేర్వేరు సైట్ల నుంచి చైల్డ్​ పోర్నోగ్రఫీకి చెందిన వీడియో క్లిప్పింగులను డౌన్​లోడ్​ చేసి తమ తమ వాట్సాప్, టెలిగ్రాం గ్రూపుల్లో స్నేహితులకు షేర్​ చేస్తున్నారు.

దీనికి నిదర్శనంగా ఈ తరహా నేరానికి పాల్పడి అరెస్టయిన అంబర్​పేట నివాసి శ్రీనివాస్​ ఉదంతాన్ని పేర్కొనవచ్చు. ఎంసీఏ విద్యార్థి అయిన శ్రీనివాస్​ వేర్వేరు సైట్ల నుంచి అశ్లీల వీడియోలు డౌన్​లోడ్ ​చేసి వాటిని షేర్ ​చేస్తూ చివరకు కటకటాల పాలయ్యాడు. ఆ తరువాత కొన్ని రోజులకే ఇంటర్నెట్‌లో చైల్డ్​పోర్నోగ్రఫీ వీడియోల కోసం సెర్చ్​ చేస్తూ కాచిగూడకు చెందిన ప్రశాంత్, తార్నాకకు చెందిన మహ్మద్​ ఫిరోజ్​ పోలీసుల చేతికి చిక్కిపోయారు.

నేరాలకు పాల్పడుతున్నారు..

చైల్డ్ ​పోర్నోగ్రఫీ వీడియోలు చూడటానికి అలవాటు పడుతున్న వారిలో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. వీరిలో పదిహేనేళ్ల మైనర్లతో పాటు యాభై సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న వారు కూడా ఉన్నారు. వీడియోల్లో చూసినట్టుగా వికృత వాంఛలను తీర్చుకోవటానికి చిన్నారులను బలి చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా బోరబండ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ వ్యక్తి ఏడేళ్ల బాలునిపై వరుసగా కొన్నిరోజులపాటు లైంగిక దాడి చేయటాన్ని పేర్కొనవచ్చు.

సదరు వ్యక్తి పెడుతున్న హింసను భరించలేకపోయిన బాధితుడు చివరకు తల్లిదండ్రులకు విషయం చెప్పటంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులకు విషయం తెలిసి అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తికి దేహశుద్ది కూడా చేశారు. కొన్నిరోజుల క్రితం హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఇలా అశ్లీల వీడియోలు చూడటానికి అలవాటుపడ్డ అయిదుగురు 10వ తరగత విద్యార్థులు తమ సహ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా చెబుతూ పోతే ఎన్నో ఉదంతాలున్నాయి.

అరెస్టులు చేస్తున్నా..

ఈ తరహా నేరాలను అరికట్టటానికి రాష్ర్ట సీఐడీ శాఖ నోడల్ ​ఏజన్సీగా పని చేస్తోంది. అంతర్జాతీయ సంస్థలతో పాటు టిప్​లైన్​ద్వారా అందుతున్న సమాచారంతో కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తోంది. సీఐడీకి చెందిన ఓ సీనియర్​ అధికారి తెలిపిన ప్రకారం జనవరి నుంచి నవంబర్​ వరకు చైల్డ్​ పోర్నోగ్రఫీకి సంబంధించి 31 కేసులు నమోదయ్యాయి. వీటిలో 43మందిని అరెస్టు కూడా చేశారు. ఇంటర్నెట్‌లోకి వెళ్లి చైల్డ్ ​పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోల కోసం సెర్చ్​ చేసినా, సోషల్​మీడియాలో అప్​లోడ్​ చేసినా అన్ని వివరాలు ఎన్సీఆర్బీలోని ప్రత్యేక వింగ్‌లో నమోదవుతాయని ఆయన తెలిపారు.

దాంతోపాటు అమెరికాతో పాటు పలు దేశాల్లో ఈ తరహా నేరాలను అరికట్టటానికి వేర్వేరు ఏజన్సీలు పని చేస్తున్నాయని చెప్పారు. అవి కూడా తమకు సమాచారాన్ని అందిస్తాయన్నారు. ఇక, టిప్​లైన్ ​పేర ఇలాంటి నేరాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. ఐటీ యాక్ట్​2000 ప్రకారం చైల్డ్​ పోర్నోగ్రఫీ వీడియోల కోసం సెర్చ్​చేసినా, వాటిని అప్​లోడ్​చేసినా నేరమని చెప్పారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడి పట్టుబడిన వారికి కఠిన శిక్షలు పడతాయన్నారు.

వేర్వేరు మెట్రోపాలిటన్​ సిటీల్లో చైల్డ్​ పోర్నోగ్రఫీకి సంబంధించి నమోదైన కేసులు

దేశం మొత్తం మీద నమోదైన కేసులు 52

హైదరాబాద్‌లో నమోదైన కేసులు 22

జైపూర్​లో నమోదైన కేసులు 10

చెన్నైలో నమోదైన కేసులు 6

బెంగళూరులో నమోదైన కేసులు 4

పూణెలో నమోదైన కేసులు 4

కొచ్చిలో నమోదైన కేసులు 2

నాగ్​పూర్​లో నమోదైన కేసులు 1

ముంబైలో నమోదైన కేసులు 3

Next Story

Most Viewed