దేవుడికి ప్రసాదంగా గంజాయిని పెట్టిన యువకులు అరెస్ట్! సీపీ సజ్జనార్ మరో ట్వీట్

by Ramesh Naini |

దేవుడికి ప్రసాదంగా గంజాయిని పెడుతున్నామని చెప్పిన యువకులకు సంబంధించిన రీల్‌ను ఎక్స్ వేదికగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ట్వీట్ చేశారు.

దేవుడికి ప్రసాదంగా గంజాయిని పెట్టిన యువకులు అరెస్ట్! సీపీ సజ్జనార్ మరో ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : భక్తి పేరుతో దేవుడికి ప్రసాదంగా గంజాయిని పెడుతున్నామని చెప్పిన యువకులకు సంబంధించిన రీల్‌ను ఎక్స్ వేదికగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించిన చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఫలక్‌నుమా జంగమ్‌మెట్‌కు చెందిన సభావత్ శ్రీ చరణ్, వర్తేవత్ విజయ్ కృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు. ఈ అంశంపై విచారణ చేపట్టారు. ఈ వివరాలను ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ షేర్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, వ్యూస్ మిమ్మల్ని కాపాడవని అన్నారు. అవి కేవలం క్షణికానందం మాత్రమే.. కానీ చట్టం వేసే శిక్ష మాత్రం జీవితకాలం వెంటాడుతుందని హెచ్చరించారు. సోషల్ మీడియా మత్తులో పడి మీ బంగారు భవిష్యత్తును 'కటకటాల' పాలు చేసుకోకండి.. అని సూచించారు.

ఒక్కసారి NDPS చట్టం ప్రయోగిస్తే..

కాగా, అంతకు ముందు మంగళవారం ఉదయం సజ్జనార్ వైరల్ వీడియో షేర్ చేస్తూ.. దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా? అని మండిపడ్డారు. మహాశివరాత్రి భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం.. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య.. అది వికృతమైన ఉన్మాదం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా!? అస్సలు కాదు.. ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం.. ఒక్కసారి NDPS చట్టం ప్రయోగిస్తే.. జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది.. తీవ్రంగా స్పందించారు.

లైకుల కోసం లోకాన్నే మరిచి..

లైకుల కోసం లోకాన్నే మరిచి, వ్యూస్ కోసం విలువలనే వదిలి, రీల్స్ కోసం రోడ్డున పడి, మత్తులో మునిగి జీవితాలను నాశనం చేసుకుంటారా? చెప్పండి అని పేర్కొన్నారు. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలి పెట్టకండి.. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం.. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Next Story