‘అతనే నా శవానికి తాళి కట్టాలి’.. చనిపోతూ ఆఖరి కోరిక కోరిన యువతి!

by Gantepaka Srikanth |

సోషల్ మీడియా పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. చివరకు బలవన్మరణానికి దారితీసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.

‘అతనే నా శవానికి తాళి కట్టాలి’.. చనిపోతూ ఆఖరి కోరిక కోరిన యువతి!
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. చివరకు బలవన్మరణానికి దారితీసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా కోండ్రుపాడుకు చెందిన 26 ఏళ్ల యువతి ముంబైలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సదరు యువతికి ప్రకాశం జిల్లా పొందూరు గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఎనిమిదేళ్ల క్రితం సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇటీవల కాలంలో వీరి ప్రేమ వ్యవహారంలో విభేదాలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ముంబైలో ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె రాసిన ఆఖరి కోరిక (డెత్ నోట్/చివరి సందేశం) ప్రకారం.. తన మృతదేహానికి తన ప్రియుడే తాళి కట్టాలని కోరింది. ఆ యువతి చివరి కోరికను నెరవేర్చాలంటూ కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ముంబై నుంచి నేరుగా ప్రకాశం జిల్లా పొందూరులోని ప్రియుడి ఇంటికి తరలించారు. తన కూతురి చావుకు కారణమైన యువకుడు.. ఆమె శవానికైనా తాళి కట్టాలంటూ డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబ సభ్యులు శవంతో వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు ఇంటి గేటుకు తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి బంధువులు, కుటుంబ సభ్యులు గేటు తాళాలు పగులగొట్టి, యువకుడి ఇంటి ముందే మృతదేహాన్ని ఉంచి న్యాయం చేయాలంటూ తీవ్ర నిరసనకు దిగారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిరసనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తూ, ఘటనపై విచారణ చేపట్టారు.

Next Story