స్నేహితుడి కారు తీసుకుని వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

by Taduka Kalyani |

స్నేహితుడికి చెప్పకుండా కారు తీసుకుని వెళ్లిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషాదకర ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ పెద్ద గోల్కొండ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

స్నేహితుడి కారు తీసుకుని వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు
X

దిశ, శంషాబాద్: స్నేహితుడికి చెప్పకుండా కారు తీసుకుని వెళ్లిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషాదకర ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ పెద్ద గోల్కొండ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన బైరెడ్డి సవంత్ రెడ్డి (21) సంగారెడ్డి సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటూ పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తనతో పాటు హాస్టల్‌లో ఉంటున్న స్నేహితుడు సాయి రెడ్డికి చెందిన ఇన్నోవా క్రిస్టా (AP39 RZ 3024) కారును అతనికి చెప్పకుండా తీసుకుని బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు ముందుగా వెళ్తున్న రెడీమిక్స్ వాహనం (TS29 T 9780)ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, డ్రైవింగ్ చేస్తున్న సవంత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి మొబైల్ ఫోన్‌లోని ఎమర్జెన్సీ కాంటాక్ట్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన వయసులో యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story