సూట్ కేసులో మహిళ మృతదేహం లభ్యం.. అత్యాచారం చేసి చంపేశారా?

by Naga Rani Yarlagadda |

షెల్గావ్ నుంచి వాధవానాకు వెళ్లే రోడ్డు పక్కన కాలువ వద్ద ఒక సూట్ కేసు అనుమానాస్పదంగా పడి ఉందని సమాచారం అందింది. అక్కడికి వెళ్లి చూడగా సూట్ కేసులో మహిళ మృతదేహం కనిపించింది.

సూట్ కేసులో మహిళ మృతదేహం లభ్యం.. అత్యాచారం చేసి చంపేశారా?
X

దిశ, వెబ్‌డెస్క్: వరుసగా భార్యల హత్యలు కలకలం రేపుతున్న వేళ.. దేశంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా.. వాధవానా పోలీస్ స్టేషన్ పరిధిలో షెల్గావ్ సమీపంలో ఉన్న ఒక కాలువ వద్ద సూట్ కేసులో మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సూట్ కేసును తెరిచి చూడగా.. ఆమె శరీరంపై గాయాలు కనిపించాయి. దాంతో మహిళపై అత్యాచారం చేసి చంపేశారా ? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 25వ తేదీ సాయంత్రం షెల్గావ్ నుంచి వాధవానాకు వెళ్లే రోడ్డు పక్కన కాలువ వద్ద ఒక సూట్ కేసు అనుమానాస్పదంగా పడి ఉందని సమాచారం అందింది. అక్కడికి వెళ్లి చూడగా సూట్ కేసులో మహిళ మృతదేహం కనిపించింది. ఆమె వయసు 25-30 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, ముఖం, శరీరంపై ఉన్న గాయాలను బట్టి అత్యాచారం జరిగినట్లు తెలుస్తోందన్నారు. మహిళ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. నాలుగైదు రోజులుగా సూట్ కేసులో డెడ్ బాడీ ఉండటంతో కుళ్లిన స్థితిలో కనిపించిందన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కొన్ని నెలలుగా తప్పిపోయినట్లు రిజిస్టర్ అయిన కంప్లైంట్లను పరిశీలిస్తున్నారు. మృతురాలు ఎవరన్న వివరాలు ఇంకా తెలియరాలేదని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Next Story