- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యాపేట బియ్యం దందా కేసు ఏమాయే...? ఆ పోలీసులు సేఫేనా..?
సూర్యాపేట జిల్లాలో ఒక ఎస్సై నాటిన మొక్క పెద్ద వృక్షమై వంద కోట్లకు పడగెత్తే దందాగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్ : తాను నాటిన విత్తనం మొక్కై, మొలకెత్తి, పెద్దవృక్షమే అయింది అంటుంటారు.. అలాగే ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఒక ఎస్సై నాటిన మొక్క పెద్ద వృక్షమై వంద కోట్లకు పడగెత్తే దందాగా మారింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి కాకినాడ పోర్ట్ కు పీడీఎస్ రైస్‌ను పంపించే ముఠాతో చేతులు కలిపిన ఆ ఎస్సై జిల్లాలో ఒక సైన్యాన్నే ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌తో పాటు.. కుడకుడ రోడ్డులోని ఒక వెంచర్‌ను అడ్డాగా చేసుకోని దందాను నడిపించినట్టు జిల్లాలో గుసుగుసలు వినిపిస్తున్నాయి. వీటి నేపథ్యంలోనే గత మూడు రోజుల క్రితం ‘కాకినాడ పోర్ట్ రేషన్ బియ్యం స్మగ్లింగ్‌లో సూర్యాపేట పోలీసుల పాత్ర? ఆ 11 మందిపై వేటు పడేనా..?’ కథనాన్ని మా ‘దిశ’ ప్రచురించడంతో జిల్లా పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
ఉద్యోగం అక్కడ.. పెత్తనం ఇక్కడ...
జిల్లా కేంద్రం నుంచి కాకినాడ పోర్ట్‌కు అక్రమంగా పీడీఎస్ రైస్‌ను తరలిస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఓ నలుగురు ప్రైవేట్ వ్యక్తులను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇంత వరకు అధికారిక ప్రకటన లేకపోవడం గమనార్హం. అయితే ఆ నలుగురు ప్రైవేట్ వ్యక్తుల్లో ఒకరి కనుసన్నలోనే గతంలో జిల్లా పోలీస్ యంత్రాంగం నడిచేదనే విమర్శలు ఉన్నప్పటికీ అప్పటి ఉన్నతాధికారుల అండదండలు దండిగా ఉండటంలో అడిగేవారు లేకుండా పోయారనే విమర్శలు ఉన్నాయి. వారికి అప్పట్లో జిల్లా కేంద్రానికి అతిసమీపంలోని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఒక ఎస్సై సపోర్ట్ గట్టిగా ఉన్నదనే విమర్శలు లేకపోలేదు. ఎస్సై సపోర్ట్ ఉంటే ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదా అంటే.. అప్పట్లో ఆ ఎస్సై చెప్పిందే వేదం అన్న చందంగా నడిచింది వ్యవస్థ. అప్పట్లో జిల్లా పోలీస్ బాస్‌కు ఆ ఎస్సై కన్న కొడుకుకంటే ఎక్కువ. జిల్లాలోని తనకంటే పెద్ద ఆఫీసర్లు కూడా తాను చెప్పినట్టే వినాలి అనే విధంగా హుకూం జారీ చేసేవాడనే విమర్శలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి. అలా ఆ ఎస్సైతో మంచి మాటగా ఉంటే చాలు అనే విధంగా ఆయనతో పాటు ఇంకొంత మంది ఎస్సై స్థాయి అధికారులు తనతో చేతులు కలిపి బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే ముఠాకు సహకరించే వారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి విమర్శల నేపథ్యంలో తాము ఇంకా ఇక్కడే ఉంటే బాగోదు అనుకున్న పలువురు పోలీస్ అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లినట్టు సమాచారం. ఉద్యోగాలు ఎక్కడ చేసినా జిల్లాలో వారి పెత్తనం మాత్రం తగ్గలేదాట. ఇప్పటికి వారి కనుసన్నలోనే బియ్యం తరలింపు జరుగుతున్నదనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
రాష్ట్రం బార్డర్లు దాటించే బాధ్యత వారిదే..
ఒక్కటి కాదు.. రెండు కాదు.. వందకోట్లు. ఇందులో లారీ నడిపించే డ్రైవర్ దగ్గర నుంచి బియ్యం కొలిసే వారు.. మధ్య వర్తులుగా వ్యవహరించే వారు.. జిల్లాలు, రాష్ట్రాల బార్డర్లు దాటించే పోలీస్ అధికారుల వరకు.. ఎవ్వరి భాగం వారిదే. జిల్లాల నుంచే కాదు.. రాష్ట్రం బార్డర్లు దాటించే బాధ్యత కూడా పోలీసులే తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఎవరికెంత అనేది కూడా ఆ ఎస్సై సారే డిసైడ్ చేసేవాడట. సారు చెప్పిందే వేదం.. సారు రాసిందే శాసనం అనే విధంగా నడిచేదాట వారి దందా.
చర్యలు తీసుకుంటారా..? కేసును మూసేస్తారా...?
సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి కాకినాడ పోర్ట్‌కు అక్రమంగా బియ్యం రవాణ జరుగుతున్నదనే విమర్శలు, అక్రమార్కులకు పోలీస్‌లే సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్‌ల పని తీరుపై ఎంక్వైరీ చేయాలని మల్టీ జోన్ –2 ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. దానిపై విచారణ చేపట్టిన జిల్లా పోలీస్ యంత్రాంగం ఇంతవరకు ఎలాంటి వివరాలు వెళ్లడించకపోవడంపై సర్వత్రా అనుమానాలు వెళ్లువెత్తుతున్నాయి. అయితే జిల్లా పోలీస్ బాస్ మాత్రం తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే జిల్లా ఎస్పీపై నమ్మకం ఉన్నప్పటికీ బియ్యం దందాలో భాగస్వామ్యం ఉన్న పోలీస్ అధికారులు మాత్రం తమకున్న పలుకు బడితో విషయాన్ని బయటకు రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ కేసును మూసివేస్తారా..? లేకుంటే వారిపై చర్యలు తీసుకుంటారా...? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నాడు బియ్యం దందాలో చక్రం తిప్పిన ఎస్ఐ, ఆపై స్థాయి అధికారులు డీజీపీ స్థాయిలో ఫైరవీలు చేస్తున్నట్లు పోలీస్ శాఖలో ప్రచారం జరుగుతుంది.






