DU ప్రొఫెసర్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. పశ్చిమ బెంగాల్‌లో దంపతుల అరెస్ట్

by Kema Shiva Kumar |

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దేవోస్మిత పాల్ దారుణ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

DU ప్రొఫెసర్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. పశ్చిమ బెంగాల్‌లో దంపతుల అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో కలకలం సృష్టించిన ఢిల్లీ యూనివర్సిటీ (DU) అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవోస్మిత పాల్ (42) మర్డర్ కేసును పోలీసులు మూడంటే మూడు రోజుల్లోనే చేధించారు. సౌత్ ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్న ఆమె దారుణ హత్యకు గురవగా.. ఈ ఘోరానికి పాల్పడిన ఓ దంపతులను పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని వర్ధమాన్ (Burdwan)లో శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విచారణలో భాగంగా పోలీసులే షాక్ అయ్యే నిజాలు బయపడ్డాయి. మృతురాలు దేవోస్మిత పాల్‌కు పశ్చిమ బెంగాల్‌లోని వర్ధమాన్‌లో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నిందితులైన దంపతులు కొంతకాలంగా అద్దెకు (Tenants) ఉంటున్నారు. అయితే, వారు ఆ ఇంటిని తామే కొనుగోలు చేయాలని భావించి, దేవోస్మితపై ఒత్తిడి తెచ్చారు. కానీ, ఆ ఆస్తిని అమ్మడానికి దేవోస్మిత అంగీకరించలేదు. దీంతో ఎలాగైనా ఆమెను దారికి తెచ్చుకోవాలని, అంతం చేయాలని ఆ దంపతులు పక్కా స్కెచ్ వేశారు.

ప్లాన్ ప్రకారం ఢిల్లీకి వచ్చి..

అయితే, తమపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఆ దంపతులు తమ చిన్న బిడ్డను కూడా వెంటబెట్టుకుని పశ్చిమ బెంగాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. జూన్ 3న ప్రొఫెసర్ దేవోస్మిత నివాసానికి వెళ్లారు. తాము అద్దె డబ్బులు (Rent) ఇవ్వడానికి వచ్చామని నమ్మించి ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ మరోసారి వర్ధమాన్‌లో ఆస్తి అమ్మకం గురించి ఆమెతో డిస్కస్ చేశారు. దేవోస్మిత మళ్లీ నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ దంపతులు ఆమె తలపై బరువైన వస్తువుతో బలంగా బాదారు. తీవ్ర రక్తస్రావం కావడంతో దేవోస్మిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితులు ఫ్లాట్‌కు బయట నుంచి తాళం వేసి, తమ స్వగ్రామానికి పారిపోయారు.

సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అడ్డంగా బుక్కై..

మృతురాలు దేవోస్మిత సోదరి దేవరతి పాల్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి ఫ్లాట్ తలుపులు పగలగొట్టి చూడగా, దేవోస్మిత రక్తపు మడుగులో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలించారు. అందులో మాస్కులు ధరించిన ఓ పురుషుడు, స్త్రీ అనుమానాస్పదంగా మెట్లు ఎక్కి ఫ్లాట్ వైపు వెళ్లడం, దాదాపు 30 నిమిషాల తర్వాత దుస్తులు మార్చుకుని బయటకు రావడం రికార్డ్ అయ్యింది. అలా ప్రత్యేక బృందాలు పశ్చిమ బెంగాల్ వెళ్లి నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం ట్రాన్సిట్ రిమాండ్‌పై ఢిల్లీకి తరలిస్తున్నారు.

Next Story