భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన అదే అంబులెన్స్‌లో ఆస్పత్రికి భార్య.. చివరికి ఏమైందంటే?

by Gantepaka Srikanth |

ఒడిశాలోని గంజాం జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. ప్రాణంగా ప్రేమించిన భర్త విగతజీవిగా పడి ఉండటం చూడలేక, ఒక మహిళ బలవన్మరణానికి యత్నించింది.

భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన అదే అంబులెన్స్‌లో ఆస్పత్రికి భార్య.. చివరికి ఏమైందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని గంజాం జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. ప్రాణంగా ప్రేమించిన భర్త విగతజీవిగా పడి ఉండటం చూడలేక, ఒక మహిళ బలవన్మరణానికి యత్నించింది. విధి ఆడిన వింత నాటకంలో.. భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన అదే అంబులెన్స్‌లో ఆమెను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాల్సి రావడం స్థానికులను కంటతడి పెట్టించింది. స్థానికుల సమాచారం ప్రకారం.. అనారోగ్యంతో బాధపడుతున్న భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టుమార్టం అనంతరం ప్రైవేట్ అంబులెన్స్‌లో అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్య, భర్త భౌతికకాయాన్ని చూడగానే తట్టుకోలేకపోయింది. అతను లేని జీవితం తనకు వద్దని భావించి, అందరూ చూస్తుండగానే ఇంటిపైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

అదే అంబులెన్స్‌లో ఆసుపత్రికి..

వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తూ మృతదేహాన్ని దించిన అంబులెన్స్ ఇంకా అక్కడే ఉండటంతో, ఆలస్యం చేయకుండా ఆమెను అదే వాహనంలో ఎక్కించి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త మృతదేహాన్ని తెచ్చిన వాహనమే, భార్య ప్రాణాలను కాపాడేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లడం అక్కడి వారిని కలచివేసింది.

Next Story