అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, అత్తామామలు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేయడంతో చివరకు ఆమె బలవన్మరణం చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది.

అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
X

దిశ, కరీంనగర్ రూరల్ : అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, అత్తామామలు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేయడంతో చివరకు ఆమె బలవన్మరణం చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది. కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత (29)ని ఆమె బంధువైన తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేష్ 14 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో కొంతకాలం నివాసం ఉంటూ సింగరేణి వన్ ఇంక్లైన్ బావిలో ఉద్యోగం చేసేవాడు. ఇటీవలే వీరు గోదావరిఖనిలోని గంగానగర్ అద్దె ఇంటిలోకి మారారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలరోజులకు మమత భర్త నరేష్, అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు లింగంపల్లి కవితలు కట్నం కోసం వేదింపులకు గురి చేసేవారు. తనను శారీరకంగా, మానసికంగా వేదింపులకు గురి చేస్తున్నారని మమత ఫోన్ చేసి తెలపడంతో రెండు నెలల క్రితం మమత సోదరుడు మహేష్ ద్వారా రూ. లక్ష నగదు ఇచ్చి పంపించారు. ఆ తరువాత కూడా మమతను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పుకుని రోధించేది.

ఈ నెల 16న మమత తన సోదరుడు మహేష్ కు ఫోన్ చేసి తనను అత్తింటి వారు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, చంపేసే ప్రమాదం ఉందని చెప్పడంతో తాను దూరంగా ఉన్నానని మరునాడు ఉదయం వస్తానని వివరించాడు. దీంతో తన చిన్నాన్న కొడుకు అయిన లింగంపల్లి శంకర్ కు కాల్ చేసి చెప్పగా.. ఆటోలో వెళ్లి మంచిర్యాల సమీపంలోని నస్పూర్ కాలనీకి తీసుకెళ్లాడు. మరునాటి ఉదయం గోదావరిఖనిలోని గంగానగర్ ఇంటి యజమాని ఫోన్ చేసి నరేష్ మెట్ల వద్ద పడి ఉన్నాడని మమతకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వెళ్లిన మమత అత్తింటి వారికి భర్త నరేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని చెప్పగా కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లిన మమత చికిత్స చేయించి మంగళవారం ఆసుపత్రికి మమత సోదరుడు మహేష్ కూడా చేరుకోగా అక్కడే ఉన్న మమత అత్తింటి వారు ఆమెను మానసికంగా వేదింపులకు గురి చేశారు. ముఖ్యంగా మ‌మ‌త‌ను పెళ్లి చేసుకోవ‌డం కార‌ణంగానే తమ కొడుకు పరిస్థితి ఇలా తయారైందంటూ సూటి పోటీ మాటలు అనడంతో తట్టుకోలేకపోయింది మ‌మ‌త‌.


వాష్ రూమ్ కి వెళ్లి వ‌స్తాన‌ని చెప్పి వెళ్లిన ఆమె ఎంత‌కు తిరిగి రాలేదు. ఆ తరువాత మహేష్ మమతకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందాడు. మద్యాహ్నం 3.35 గంటల సమయంలో మమత సోదరుడు మహేష్ కు కాల్ చేసి అత్తింటి వారి వేదింపులు తట్టుకోలేకపోతున్నానని, తాను చనిపోతున్నానని చెబుతుండ‌గానే ఆమె అరుపులు వినిపించాయి. వెంటనే మహేష్ డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వగా.. పోలీసులు మమత లొకేషన్ ట్రేస్ చేశారు. ఆమె తీగలగుట్టపల్లిలోని హనుమాన్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. పోలీసులతో పాటు మహేష్ కూడా ఘటనా స్థలానికి చేరుకోగా.. మమత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మృత దేహాన్ని కరీనంగర్ సివిల్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని ప్రొబేషనరీ ఐపీఎస్ ఆఫీసర్ సోహం సునీల్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ లు పరిశీలించారు. మమత తండ్రి లింగంపల్లి పోషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త నరేష్ తో పాటు అత్తింటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

Next Story