జ్యువెలరీ యూనిట్‌లో విషవాయువు లీక్.. నలుగురు కార్మికులు దుర్మరణం

by Kema Shiva Kumar |

గుజరాత్‌లోని సూరత్ నగరంలోని అశ్విని కుమార్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది.

జ్యువెలరీ యూనిట్‌లో విషవాయువు లీక్.. నలుగురు కార్మికులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఇండస్ట్రియల్ సిటీ గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ జ్యువెలరీ తయారీ యూనిట్‌లో విషవాయువు లీక్ అయి ఓ సూపర్‌వైజర్ సహా నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. అశ్విని కుమార్ రోడ్డు పరిధిలోని జ్యువెలరీ తయారీ ప్రక్రియలో వెలువడే రసాయన వ్యర్థాలను సేకరించేందుకు ఆ ఫ్యాక్టరీ ఆవరణలో ఓ ఈటీపీ (Effluent Treatment Plant) సెప్టిక్ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ ట్యాంక్‌ను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఎప్పటిలాగే ఇవాళ ఉదయం ఓ సూపర్‌వైజర్, ముగ్గురు కార్మికులతో కూడిన నలుగురు సభ్యుల బృందం ఆ ట్యాంక్‌ను క్లీన్ చేయడానికి వెళ్లింది. ట్యాంక్ క్లీన్ చేస్తున్న సమయంలో ఓ కార్మికుడు అకస్మాత్తుగా లోపలికి జారిపడిపోయాడు. అతడని కాపాడే క్రమంలో మిగిలిన ముగ్గురు కూడా ఒకరి వెనుక ఒకరు ట్యాంక్ లోపలికి దిగారు. అయితే, ట్యాంక్‌లో అప్పటికే పేరుకుపోయిన రసాయనాల వల్ల తీవ్రమైన విషవాయువులు వెలువడటంతో, ఊపిరాడక (Asphyxiation) నలుగురు అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయి ప్రాణాలు విడిచారు.

సేఫ్టీ మాస్క్‌లు లేకపోవడమే శాపం..

ఈ ప్రమాదంపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. సీసీటీవీ (CCTV) ఫుటేజీల పరిశీలన ప్రకారం కార్మికులు సేఫ్టీ మాస్క్‌లు ధరించలేదని తెలిపారు. రసాయన వ్యర్థాల వల్ల ఏర్పడిన పాయిజనస్ గ్యాస్ కారణంగానే వారు మరణించినట్లుగా భావిస్తున్నామని అన్నారు. పూర్తి వివరాలు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాకే తెలుస్తాయని పేర్కొన్నారు. ట్యాంక్ లోపలికి దిగే ముందు సూపర్‌వైజర్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినప్పటికీ వారు వచ్చేలోపే వీరు లోపలికి దిగడంతో ఈ ప్రమాదం జరిగిందని డీసీపీ తెలిపారు. ఈ మేరకు ట్యాంక్ నుంచి నలుగురి మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story