మ్యాన్‌ ఈటర్‌గా మారిన పులి.. ఇద్దరు వలస కార్మికులపై దాడి

by Malleboina Mahesh |

మ్యాన్‌ ఈటర్‌గా మారిన పులి వలస కార్మికులపై దాడి చేసి చంపేసింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లో చోటు చేసుకుంది.

మ్యాన్‌ ఈటర్‌గా మారిన పులి.. ఇద్దరు వలస కార్మికులపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: మ్యాన్‌ ఈటర్‌గా మారిన పులి వలస కార్మికులపై దాడి చేసి చంపేసింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లో చోటు చేసుకుంది. ఒకే రోజు, కేవలం 45 నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన ప్రేమ్‌సింగ్ దుఖీ ఉడే (55), బుధాసింగ్ శ్యామ్‌లాల్ మదావి (41) గా గుర్తించారు. వీరు అటవీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వెదురు సేకరణ (Bamboo cutting) పనుల కోసం ఇక్కడికి వచ్చారు. మొదటి ఘటన మమల రేంజ్‌లో మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో జరగ్గా, దాని నుంచి తేరుకోకముందే 4:30 గంటల సమయంలో మహదవడి రేంజ్‌లో రెండో కార్మికుడిపై పులి దాడి చేసి చంపేసింది.

ఈ వరుస మరణాలతో స్థానిక గ్రామస్తులు, వెదురు కోత కార్మికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పనుల కోసం అడవిలోకి వెళ్లే తమకు తగిన రక్షణ కల్పించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చంద్రపూర్ జిల్లాలో వన్యప్రాణుల దాడుల వల్ల మరణించిన వారి సంఖ్య 47కి చేరుకుంది. అందులో 42 మంది పులి దాడిలోనే మరణించడం గమనార్హం. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలంలో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేసి, దాడులకు పాల్పడిన పులిని గుర్తించే పనిలో ఉన్నారు. కాగా నేటి పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వలస కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

Next Story