రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు పాలిటెక్నిక్ విద్యార్థులు దుర్మరణం

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రన్నింగ్‌ కారు టైరు పేలి కారు బోల్తా పడింది.

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు పాలిటెక్నిక్ విద్యార్థులు దుర్మరణం
X

దిశ ప్రతినిధి, బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రన్నింగ్‌ కారు టైరు పేలి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదం(Road Accident)లో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చీరాల(Chirala) మండలం వాడరేవులోని మెడికల్ కాలేజీ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు, తెనాలి ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది గుంటూరు MBTS పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు(Polytechnic Students) వాడరేవు సముద్ర స్నానానికి వచ్చి తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణంలో ఇన్నోవా టైరు పేలి వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న రోహిత్ కుమార్ నాయక్ (19), అజయ్ (18) సంఘటనా స్థలంలో దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్తీక్ (24) మృతిచెందారు. తీవ్రగాయాలైన పాసల దేవదత్త (17), కష్టాల శామ్యూల్ (21), కొడమల హోసన్న (20), పసుపులేటి విష్ణు శశాంక్ (17), వట్టికూటి తనుష్ వెంకట నాగ సాయి (19), అచ్యుత ప్రణేష్ (17) చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story