దొంగతనానికి వచ్చి ఇంట్లోనే నిద్రపోయిన దొంగ.. సీన్ కట్ చేస్తే..

by Naga Rani Yarlagadda |

దొంగతనానికి వెళ్లే ఏ దొంగైనా.. గుట్టు చప్పుడు కాకుండా దొరికిందంతా దోచుకుంటాడు.

దొంగతనానికి వచ్చి ఇంట్లోనే నిద్రపోయిన దొంగ.. సీన్ కట్ చేస్తే..
X

దిశ, వెబ్‌డెస్క్: దొంగతనానికి వెళ్లే ఏ దొంగైనా.. గుట్టు చప్పుడు కాకుండా దొరికిందంతా దోచుకుంటాడు. కానీ.. ఓ దొంగ దొంగతనానికి వెళ్లి రాత్రంతా ఆ ఇంట్లోనే నిద్రపోయాడు. ఉదయాన్నే దొంగను చూసిన యజమాని పోలీసులకు పట్టించడంతో కటకటాలపాలయ్యాడు. దీనంతటికీ కారణం ఆ దొంగ ఫుల్లుగా మద్యం సేవించడమే. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని నజీరాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్యంపూర్ రైల్వే లైన్లో పక్కపక్కనే ఉన్న అన్నదమ్ముల ఇళ్లలోకి మద్యానికి బానిసైన ఓ దొంగ అర్థరాత్రి సమయంలో చొరబడ్డాడు. ముందు వినోద్ కుమార్ ఇంటి కిటికీలను పగలగొట్టి లోపలికి వెళ్లి.. లాకర్ ఓపెన్ చేసి విలువైన వస్తువుల్ని కాజేశాడు. ఆపై రెండిళ్ల మధ్య ఉన్న తలుపును కూడా పగలగొట్టి అనిల్ ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ బీరువాలో ఉన్న నగలను దొంగిలించాడు. ఇంతలో తాగిన మైకం కమ్మి అక్కడే నిద్రపోయాడు.

ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న అనిల్ ఉదయం ఇంటికి వచ్చాక దొంగను చూసి షాకయ్యాడు. ఇల్లంతా వెతికాడు. బంగారం, ఇతర విలువైన వస్తువులు మాయమైనట్లు గుర్తించి.. నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికెళ్లి చూడగా.. అన్నీ అతని వద్దే కనిపించాయి. ఇరుగు పొరుగు వారిని పిలిచి విషయం చెప్పగా.. దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story