పట్టణంలో వరుస దొంగతనాలు

by Disha Web |
పట్టణంలో వరుస దొంగతనాలు
X

దిశ, రామకృష్ణాపూర్ : రామకృష్ణాపూర్ పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో పట్టణవాసులు బెంబేలెత్తుతున్నారు. పట్టణంలో దొంగతనాలు పెరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పగలు, రాత్రులు పలు కాలనీల్లో గస్తీ చేపట్టినప్పటికి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం స్థానిక ఒకటవ వార్డు అల్లూరి సీతారామరాజు నగర్ కు చెందిన షేర్ లింగమూర్తి ఆటోడ్రైవర్ ఇంట్లో దొంగలు కన్నం వేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగమూర్తి, భార్య కనక లక్ష్మిలు వారి వృత్తి నిమిత్తం ఇంటికి తాళం వేసి మధ్యాహ్నం బయటకు వెళ్లారు.

ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి వెనకాల తలుపులు పగలగొట్టి ఇంటి లోపల బీరువా తెరచి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. 3 తులాల బంగారు ఆభరణాలు, 5తులాల వెండి, 10 వేల నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఎస్సై అశోక్ లు క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. ఎస్సై అశోక్ మాట్లాడుతూ పట్టణంలో ప్రత్యేక బృందాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా కాలనీల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


Next Story