ప్రియురాలే హంతకురాలు.. సూరం చెరువులో డ్రమ్ము లో లభ్యమైన మృతదేహం కేసులో వీడిన మిస్టరీ..

by Disha Web Desk 11 |
ప్రియురాలే హంతకురాలు.. సూరం చెరువులో డ్రమ్ము లో లభ్యమైన మృతదేహం కేసులో వీడిన మిస్టరీ..
X

దిశ, బడంగ్ పేట్: సంచలనం సృష్టించిన సూరం చెరువులోని ఓ డ్రమ్ములో లభ్యమైన 30 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం, హత్య కేసు మిస్టరీని పహాడిషరీఫ్​ పోలీసులు ఛేదించారు. పెళ్ళికి ముందు వివాహితతో అక్రమసంబంధమే హత్యకు దారేతీసింది. ప్రియుడిని కాదని ప్రియురాలు మరొకరితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధానికి ఎక్కడ అడ్డు వస్తాడో అని ప్రియురాలే ఈ ఘాతుకానికి పాల్పడింది. పురన్ సింగ్ హత్య కేసులో పహాడి షరీఫ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రియురాలితో పాటు మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో జేసీబీతో పాటు కత్తి, ఒక సెల్ ఫోన్, రక్తపు మరకల బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్వరం ఏసీపీ అంజయ్య, పహాడి షరీఫ్ ఇన్ స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తో కలిసి వివరాలు వెల్లడించారు. తుక్కుగూడలోని సూరం చెరువులో 30 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం డ్రమ్ములో కాళ్లు పైకి తేలుతూ ఉండడంతో ఈ నెల 25 వ తేదీన సాయంత్రం 4గంటలకు గమనించిన స్థానికులు పహాడిషరీఫ్​ పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహూటిన ఘటనా స్థలికి చేరుకున్న పహాడిషరీఫ్ పోలీసులు సూరం చెరువులోని డ్రమ్ములో ఉన్న మృతదేహాన్ని వెలికిదీశారు. అప్పటికే ఆ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించడంతో మూడు రోజుల క్రితమే అతను మృతి చెంది ఉండవచ్చని అది గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా పోలీసులు కేసులు నమోదు చేశారు.

డ్రమ్ములో కత్తితో పాటు, మృతుని శరీరంపై కత్తి గాయాలు ఉన్నాయి. దీంతో ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించడానికి ఆరు టీంలుగా విభజించారు. అనంతరం సమీప పోలీస్టేషన్​ పరిధిలలో 30 నుంచి 40 సంవత్సరాల వ్యక్తుల మిస్సింగ్​లు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ నెల 23వ తేదీన ఓ వ్యక్తి మిస్సింగ్​ కేసులు నమోదు కావడంతో ఆ ఫైల్​ ఫొటోను ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్​ అయిన వ్యక్తి భార్యను విచారించగా అతని ఒంటిపై ఉన్న బట్టల సహాయంతో అతను తన భర్తనే అని గుర్తించింది.

మిస్సింగ్​ కేసు ఆధారంగా బండ్లగూడ పటేల్​ నగర్​కు చెందిన పురన్​ సింగ్​ (30) గా పహాడిషరీఫ్ పోలీసులు గుర్తించారు. ఉత్తర్​ ప్రదేశ్​ ఉరయ్ ​గ్రామానికి చెందిన పురన్​సింగ్ కు ఘోరక్​పూర్​ వికలాంగురాలు మమతాదేవితో ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్​లోనే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. కృష్ణ (4), ప్రవీణ్​కుమార్​ (2) వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పురన్​ సింగ్​ గప్​చుప్​ బండి నడిపించుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని, ఈ నెల 22వ తేదీన తన భర్త కనిపించకుండా పోయాడని ఈ నెల 23వ తేదీన సాయంత్రం భార్య మమతా దేవి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చిట్ట చివరి కాల్ సుగుణ రామ్ దే..

దీంతో పురన్​సింగ్​ ఫోన్​ నెంబర్​ కు చివరగా వచ్చిన పోన్​కాల్స్​ లిస్ట్​ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 22 వ తేదీన రాత్రి సుగుణ రామ్ అనే వ్యక్తి నుంచి ఎక్కువగా కాల్స్ వచ్చినట్టు గుర్తించారు. అంతే గాకుండా తుక్కుగూడ చెరువు సమీపంలోని సూరం చెరువు ప్రాంతంలో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సుగుణ రామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

రాజస్థాన్ లోనే పురన్​సింగ్​కు ఓ వివాహితతో లవ్​ ఎఫైర్​?

పురన్​సింగ్​కు పెళ్లికి మునుపే అయితే ఉత్తర్​ ప్రదేశ్​ కు చెందిన దగ్గరి బంధువు, ఇది వరకే వివాహం జరిగి, ఇద్దరు పిల్లలు ఉన్న జయదేవి అనే వివాహితతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఐదేళ్ళ క్రితమే హైదరాబాద్​కు వచ్చిన గప్​చుప్​ల బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న పురన్​సింగ్​కు మమతా దేవితో వివాహం జరిగినట్లు తెలుసుకున్న జయదేవి వారికీ పెద్దకుమారుడు కృష్ణ జన్మించాక సదరు వివాహితతో పురన్​సింగ్​కు గొడవలు ప్రారంభమయ్యాయి. తనను పెళ్ళి చేసుకోమంటే మరో యువతిని ఎలా పెళ్ళి చేసుకుంటావని లాక్​ డౌన్​ సమయంలో జయదేవి హైదరాబాద్​కు వచ్చి పురన్​సింగ్​తో గొడవకు దిగింది. తన భర్తను, ఇద్దరు పిల్లలను వదిలి వచ్చానని తనను పెళ్ళి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి చేసింది. అనంతరం వీరిమధ్య జరిగిన ఒప్పందంలో జయదేవి కూడా అప్పటి నుంచి కాటేదాన్​ ప్రాంతంలోనే ఓ గది అద్దెకు దిగి ఇక్కడే నివసిస్తుండగా అప్పుడప్పుడు ఆమె దగ్గరికి వచ్చి వెళ్తుండేవాడని పోలీసులు గుర్తించారు.

ప్రియుడిని కాదని మరో వ్యక్తితో అక్రమ సంబంధం

జయదేవి సంవత్సరం కాలంగా బాలాపూర్ ప్రాంతంలో ఓ వెంచర్ లో పనిచేసేది. అక్కడ జేసేబీ డ్రైవర్ గా పనిచేస్తున్న నజీమ్ (31) తో పరిచయం ఏర్పడింది. వారి మధ్య కూడా అక్రమ సంబంధంకు దారితీసింది. పురన్ సింగ్ ఎక్కడ అడ్డుపడతాడో అని నజీమ్ తో కలిసి జయదేవి హత్యకు కుట్ర పన్నింది.

పురన్ సింగ్ హత్య కు కుట్ర

ఈ నేపథ్యంలో తుక్కుగూడ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. పథకం ప్రకారం సుగుణ రామ్ (42) ను పురన్ సింగ్ ను ఈ నెల 22 వ తేదీన తుక్కు గూడ ప్రాంతంలోకి రప్పిస్తే రూ.10 వేలు ఇస్తానని జయదేవి చెప్పింది. ఈ నెల 22 వ తేదీన రాత్రి పురన్ సింగ్ నడుచుకుంటూ బయలుదేరాడు. అ తర్వాత ఆటో ఎక్కి తుక్కుగూడలో దిగాడు. అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న జయదేవి పురన్ సింగ్ రాగానే గదిలోకి తీసుకు వెళ్ళింది. ఓ గంట పాటు గదిలోనే ఉన్నారు. అప్పటికే బయట ఎదురుచూస్తున్న నజీమ్, అతని కజిన్ బ్రదర్ తో పాటు మరో ఇద్దరి సహకారంతో గదిలోకి వెళ్ళి కత్తితో పురన్ సింగ్ పై దాడి చేశారు. పెనుగులాటలో అతని కాళ్ళను జయదేవి పట్టుకుని ఉండగా నజీమ్ హత్య చేశారు.

అనంతరం ఆ మృతదేహన్ని ఓ డ్రమ్ములో తలక్రిందులుగా పెట్టి, కత్తిని కూడా అందులోనే పడేశారు. ఆ మృతదేహన్ని తరలించడానికి పక్కనే వెంచర్ లో ఉన్న జేసీబీ సహాయంతో డ్రమ్ములో మృతదేహంతో సహా చెరువులో పడే శారు. అనంతరం అక్కడి నుంచి అంతా పరాయ్యారు. సుగుణ రామ్ నుంచి రాబట్టిన వివరాల ప్రకారం తుక్కు గూడలో అద్దెకు తీసుకున్న గదిని ఖాళీ చేయడానికి వచ్చిన నజీమ్ ను అప్పటికే మాటు వేసి ఉన్న పహాడి షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పురన్ సింగ్ హత్య చేసిన నజీమ్ తో పాటు సహకరించిన సుగుణ రాం ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ హత్య కేసు మిస్టరిని ఛేదించడానికి సిసి కెమెరాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఈ హత్య కేసు వెలుగులోకి రావడానికి కృషి చేసిన 15 మంది పోలీసులకు రివార్డులు అందజేశారు. పరారీలో ఉన్న జయదేవి తో పాటు మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును పహాడి షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed