నమ్మించి వంచించిన కిరాతకుడు.. ‘నాన్న జాగ్రత్త’ అంటూ యువ టీచర్ ఆత్మహత్య

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-06 03:04:17  IST  )

ఏపీలోని మార్కాపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కిరాతకుడు వేధింపులకు యువ టీచర్ మాధవి ఆత్మహత్య చేసుకుంది.

నమ్మించి వంచించిన కిరాతకుడు.. ‘నాన్న జాగ్రత్త’ అంటూ యువ టీచర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: తనకు ముందే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఓ కిరాతకుడు ఆడిన ఆటలో ఓ యువ టీచర్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన మార్కాపురం (Markapura) జిల్లా పామూరు (Pamuru) మండల పరిధిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు అయ్యవారిపల్లికి చెందిన మాధవి (24) స్థానికంగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో నాగూర్ భాష అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, నాగూర్ భాష (Nagur Basha)కు ఇదివరకే వివాహం అయినట్లుగా మాధవికి ఆలస్యంగా తెలిసింది. నిజం తెలుసుకున్న ఆమె, అతడి దూరం పెట్టాలని నిర్ణయించింది.

క్షోభకు గురయ్యేలా బ్లాక్‌మెయిల్..

అయితే, మాధవి తనను దూరం పెడుతోందన్న కోపంతో నాగూర్ భాష రాక్షసుడిలా మారాడు. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో తీసుకున్న వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని, పరువు తీస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన మాధవి, ఆత్మహత్యే శరణ్యమని భావించింది. ఆత్మహత్యకు ముందు మాధవి తన చేతిపై ‘నాన్న జాగ్రత్త’ అని పెన్నుతో రాసుకుని తన గదిలో ఉరి వేసుకుంది. తన తర్వాత తన తండ్రి ఒంటరి అవుతాడనే ఆవేదనతో ఆమె చేసిన ఆ చివరి అక్షరాలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ క్రమంలోనే మాధవి మృతికి కారణమైన నాగూర్ భాషపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుని, ఆమె చావుకు కారణమైన వ్యక్తిని వదలకూడదని గ్రామస్థులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సిక్కింలో పర్యాటకుల విలవిల.. లాచెన్‌లో చిక్కుకుపోయిన 800 మంది!

Next Story