చిన్నగీతే కదా! అని చిన్నచూపు చూడొద్దు.. తెలంగాణ పోలీస్ హెచ్చరిక

by Ramesh Naini |   (  Updated:2026-01-20 11:05:09  IST  )

రోడ్డు మీద ఉన్న చిన్న తెల్ల గీతను తేలికగా తీసుకోవద్దని తెలంగాణ పోలీస్ మరోసారి హెచ్చరించారు.

చిన్నగీతే కదా! అని చిన్నచూపు చూడొద్దు.. తెలంగాణ పోలీస్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు మీద ఉన్న చిన్న తెల్ల గీతను తేలికగా తీసుకోవద్దని తెలంగాణ పోలీస్ మరోసారి హెచ్చరించారు. మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా @TelanganaCOPs విడుదల చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. రోడ్డు భద్రతా నిబంధనలను అతిక్రమించడం ఎంతటి ప్రాణ నష్టానికి దారి తీస్తుందో తెలిపే సీసీటీవీ ఫుటేజీని షేర్ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.‘చిన్నగీతే కదా! అని చిన్నచూపు చూడొద్దు. అర అడుగు దూరం, ఒక్క క్షణం సమయం ఆ యువకుడి కుటుంబంలో విషాదాన్ని నింపింది. రోడ్డు భద్రతా నియమాలను పట్టించుకోకుండా డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరి ఓవర్ స్పీడ్, ఓవర్ థింకింగ్ మరొకరి జీవితంలో అంధకారం నింపింది’ అని తెలంగాణ పోలీస్ ట్వీట్‌లో పేర్కొన్నారు. వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియోలో, అతి వేగంతో ప్రయాణిస్తున్న ఓ బైకర్ రోడ్డుపై ఉన్న వైట్ లైన్‌ను దాటి ముందుకు వెళ్లే ప్రయత్నం దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఎదురుగా వచ్చిన వాహనం బైకర్‌ను ఢీకొనడంతో అతడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఈ ఘటన రోడ్డు మీద గీతల ప్రాముఖ్యతను స్పష్టంగా చూపిస్తోంది.

కాగా, రోడ్డుపై వైట్ లైన్ గ్యాప్‌తో ఉన్న చోట్ల మాత్రమే ఓవర్‌టేక్ చేయడం, లైన్ మార్చడం సురక్షితం. అయితే సింగిల్ లేదా డబుల్ వైట్ లైన్‌లు గ్యాప్ లేకుండా ఉన్నప్పుడు ఓవర్‌టేక్ చేయడం ప్రమాదకరం. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్ర ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఒక్క క్షణంలోనే కుటుంబాల జీవితాలు చీకట్లోకి వెళ్లిపోతాయని, ప్రతి డ్రైవర్ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ పోలీస్ విజ్ఞప్తి చేశారు.

Next Story