అనుమాన‌స్ప‌దంగా మ‌హిళా మృతి... నాలుగు తులాల బంగారం మాయం..!

by Ratna Kumari |   (  Updated:2025-11-03 03:08:47  IST  )

గద్వాల పట్టణంలోని శేరెల్లివీధిలో ఆదివారం చోటుచేసుకున్న ఒక మహిళ మృతి సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతురాలి మృతి వెనుక అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఆమె మెడలో ఎప్పుడూ ధరించే నాలుగు

అనుమాన‌స్ప‌దంగా మ‌హిళా మృతి... నాలుగు తులాల బంగారం మాయం..!
X

దిశ‌, గ‌ద్వాల క్రైమ్ : గద్వాల పట్టణంలోని శేరెల్లివీధిలో ఆదివారం చోటుచేసుకున్న ఒక మహిళ మృతి సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతురాలి మృతి వెనుక అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఆమె మెడలో ఎప్పుడూ ధరించే నాలుగు తులాల విలువైన బంగారు ఆభరణాలు కనిపించకపోవడం కేసును మరింత క్లిష్టంగా మార్చింది. పోలీసుల సమాచారం మేరకు ఆదివారం ఉదయం శేరెల్లివీధిలోని తమ నివాసంలో భార్య‌ మృతి చెందినట్లు భర్త గమనించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు మరియు స్థానికుల్లో కలకలం చెలరేగింది.


వార్త అందిన వెంటనే గద్వాల సీఐ టి. శ్రీను ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ కల్యాణ్ కుమార్, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతదేహం ఉన్న గదిని, ఇంటి పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదికలో మృతికి గల నిజమైన కారణాలు, ఏదైనా హింసకు గురైందా లేదా అనే అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బంగారు ఆభరణాలు మాయం కావడం, మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని, పోలీసులు దోపిడీ అనంతరం హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యులు, పొరుగువారిని విచారించి వివిధ కోణాల్లో కేసు పురోగతిని పరిశీలిస్తున్నారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Next Story