డబ్బుల విషయంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

by Taduka Kalyani |

రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

డబ్బుల విషయంలో వ్యక్తి అనుమానాస్పద మృతి
X

దిశ, సదాశివనగర్ (రామారెడ్డి): రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాటికొండ గణేష్ (37) కుటుంబ సభ్యులతో డబ్బుల విషయంలో గొడవ జరిగిన అనంతరం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై మురళి తెలిపిన వివరాల ప్రకారం.. భూమి విక్రయానికి సంబంధించిన డబ్బుల విషయంలో గణేష్ తన తల్లి తాటికొండ బుచ్చవ్వ, భార్య అపర్ణతో మాట్లాడినట్లు తెలిపారు. అయితే తమ వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని వారు చెప్పడంతో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం గణేష్ ఇంట్లోకి వెళ్లి తలుపులకు గడియపెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. సమాచారం అందుకున్న రామారెడ్డి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై మురళి తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై తెలిపారు.

Next Story