- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు..!
శ్రీశైలం దేవదర్శనానికి వెళ్తూ, ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా

దిశ, జడ్చర్ల / ఊర్కొండ : శ్రీశైలం దేవదర్శనానికి వెళ్తూ, ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్న విషాదకర ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలో బుధవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
కారు డ్రైవర్ కారులో ఇరుక్కుని గంటన్నర పాటు నరకయాతన అనుభవించారు. సమాచారం అందుకున్న పోలీసులు దాదాపు గంటసేపు కష్టపడి అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఊర్కొండ ఎస్సై కృష్ణదేవ మరియు స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామానికి చెందిన యువకులు కుమార్, లింగం, యాదయ్య, అభిలాష్, ప్రశాంత్, కిరణ్‌లు శ్రీశైలం గేట్లు ఓపెన్ కావడంతో దైవదర్శనంతో పాటు ప్రాజెక్టు తిలకించేందుకు బుధవారం సాయంత్రం కారులో బయలుదేరారు.
ఈ క్రమంలో ఊర్కొండ మండల పరిధిలోని ఊర్కొండ పేట గ్రామ శివారులోని 167వ జాతీయ రహదారిపై పత్తి మిల్లు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వారు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు వెంటనే 108 ఎంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కుమార్, లింగం, యాదయ్యలను మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.
కారు అతివేగంగా ఉండటం వల్ల రోడ్డుపై ఆగి ఉన్న లారీని గమనించకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కృష్ణదేవ తెలిపారు.
ఫరూక్‌నగర్ ఎలికట్టలో విషాద ఛాయలు
దేవదర్శనానికి వెళ్లిన యువకులు ఊర్కొండ వద్ద కారు ప్రమాదానికి గురై ముగ్గురు తీవ్రంగా గాయపడిన వార్త ఎలికట్ట గ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై ఆసుపత్రుల వద్దకు పరుగులు తీశారు. తమ వారిని చూసేందుకు తహతహలాడుతుండగా, గ్రామమంతా దిగ్బ్రాంతికి లోనైంది.






