మహిళా న్యాయవాది హత్య కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు

by Ajay Maddhiboyina |

రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండ‌లంలో జ‌రిగిన మ‌హిళా న్యాయ‌వాది హ‌త్య కేసులో కీల‌క అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. భూ వివాదం కార‌ణంగానే స్వ‌ప్న గొంతు కోసి సొంత అన్న హ‌త్య చేసినట్టు తేలింది.

మహిళా న్యాయవాది హత్య కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండ‌లంలో జ‌రిగిన మ‌హిళా న్యాయ‌వాది హ‌త్య కేసులో కీల‌క అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. భూ వివాదం కార‌ణంగానే స్వ‌ప్న గొంతు కోసి సొంత అన్న హ‌త్య చేసినట్టు తేలింది. మొయినాబాద్ మండ‌లం కేతిరెడ్డిప‌ల్లి గ్రామంలో నివాసం ఉండే శాంత‌య్య‌కు ఇద్ద‌రు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు, పెద్ద కూతురుకు వివాహం జ‌ర‌గ్గా స్వ‌ప్న చేవెళ్ల కోర్టులో న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. స్వ‌ప్న‌కు ఇంకా వివాహం జ‌ర‌గ‌లేదు. అయితే తండ్రి చ‌నిపోయిన అనంత‌రం అత‌డిపేరు మీద ఉన్న 10 ఎక‌రాల భూమిని భార్య వెంక‌ట‌మ్మ పేరు మీద రిజిస్ట్రేష‌న్ చేయించారు.

త‌ర‌వాత‌ అందులో 6 ఎక‌రాలు కుమారుడు రాజు పేరిట చేసి మిగితా 4 ఎక‌రాల భూమిని త‌ల్లి వెంక‌ట‌మ్మ పేరు మీద‌నే ఉంచుకున్నారు. కాగా ఏడాది క్రితం రాజు త‌ల్లికి తెలియ‌కుండా 4 ఎక‌రాల భూమిని త‌న పేరు మీద అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. దీంతో పోలీసుల‌కు, రెవెన్యూ అధికారుల‌కు ఫిర్యాదు చేసి అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్న 4 ఎక‌రాల భూమిని తిరిగి స్వ‌ప్న త‌ల్లి పేరిట రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారు.

ఈ క్ర‌మంలో స్వ‌ప్న‌ త‌ల్లితో పొలం వ‌ద్ద స‌ర్వే చేయింస్తుండ‌గా రాజు కొంద‌రు వ్య‌క్తుల‌తో పొలం వ‌ద్ద‌కు వ‌చ్చి ఆమె గొంతు కోసి పారిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించగా ఇప్ప‌టికే మృతి చెందిన‌ట్టు వైద్యులు నిర్దారించారు. అయితే గ‌త నెలలో సైతం స్వ‌ప్న స్కూటీకి ప్ర‌మాదం జ‌ర‌గ్గా ఆమె కాలు విరిగింది. త‌న అన్న‌నే త‌న‌పై దాడి చేయించాడ‌ని ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. భూ త‌గాలదాల్లో స్వ‌ప్న వేధిస్తోందని, త‌న‌పై హ‌త్యాయ‌త్నం కేసు పెట్టింద‌ని రాజు కొద్దిరోజులుగా చెబుతున్నాడ‌ని అత‌డి స్నేహితులు చెప్పారు.

Next Story