మళ్లీ చిక్కుల్లో సంధ్యా కన్వెన్షన్ ఎండీ: రూ.14 కోట్ల మోసం, భార్యపై కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-21 02:10:06  IST  )

సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై మరో కేసు నమోదైంది. నకిలీ పత్రాలతో ఢిల్లీకి చెందిన ఎథెనా ప్రాజెక్ట్స్ సంస్థను రూ.14 కోట్లకు పైగా మోసం చేసినట్లుగా ఫిర్యాదు అందింది.

మళ్లీ చిక్కుల్లో సంధ్యా కన్వెన్షన్ ఎండీ: రూ.14 కోట్ల మోసం, భార్యపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: సంధ్యా కన్వెన్షన్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) శ్రీధర్ రావు (Sridhar Rao) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు భూవివాదాలు, మోసం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW)లో మరో కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థను కోట్లలో మోసం చేశారన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

నకిలీ పత్రాలతో భారీ స్కామ్..

పోలీసుల సమాచారం ప్రకారం.. ఢిల్లీ (Delhi)కి చెందిన ‘ఎథెనా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థతో శ్రీధర్ రావు గతంలో వ్యాపార లావాదేవీలు జరిపారు. ఈ క్రమంలో కొన్ని నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి, సదరు సంస్థను నమ్మించి సుమారు రూ.14 కోట్ల మేర మోసం చేసినట్లుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోర్జరీ పత్రాల ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందేందుకు శ్రీధర్ రావు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ లావాదేవీల్లో శ్రీధర్ రావుతో పాటు ఆయన భార్య సంధ్యకు కూడా భాగస్వామ్యం ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో సైబరాబాద్ EOW పోలీసులు వారిద్దిరపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ సంస్థ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలను సేకరించినట్లుగా సమాచారం. కాగా శ్రీధర్ రావుపై గతంలో గచ్చిబౌలి, రాయదుర్గం వంటి పోలీస్ స్టేషన్లలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి.

Next Story