రూ. 15 వేలకు కక్కుర్తి.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా..

by Gantepaka Srikanth |

అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు మాత్రం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

రూ. 15 వేలకు కక్కుర్తి.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు మాత్రం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆస్తి పన్ను (Property Tax) తగ్గించేందుకు లంచం డిమాండ్ చేసిన బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని ఓ బాధితుడు తన ఆస్తి పన్నును తగ్గించుకోవాలని బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డిని ఆశ్రయించాడు. ఇందుకు ప్రతిఫలంగా నిఖిల్ రెడ్డి రూ.35 వేలు లంచం డిమాండ్ చేశాడు. గత్యంతరం లేక బాధితుడు ఇప్పటికే నిఖిల్ రెడ్డికి రూ.20 వేలు ముట్టజెప్పాడు. అయితే, మిగిలిన రూ.15 వేలు కూడా ఇస్తేనే పన్ను తగ్గిస్తానని, లేకపోతే పని జరగదని సదరు బిల్ కలెక్టర్ మొండికేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

పక్కా ప్లాన్‌తో పట్టుకున్న ఏసీబీ..

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహాన్ని రచించారు. గురువారం నాడు మున్సిపల్ కార్యాలయం వద్ద బాధితుడి నుండి మిగిలిన రూ.15 వేల నగదును నిఖిల్ రెడ్డి తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. నగదుతో సహా బిల్ కలెక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు నిఖిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. నిఖిల్ రెడ్డి గతంలో కూడా ఇలాగే ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వెనుకాడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Next Story